April 11, 2013

జైల్లో జగన్ రాజభోగం కొత్త అల్లుడిలా చూసుకుంటున్నారు

ఒక్క క్షణం కరెంటు పోనివ్వడం లేదు
శాటిలైట్ ఫోన్లు ఇస్తున్నారు
రోజుకు 400 మందితో ములాఖత్‌లు
జైలు అధికారులను మార్చాలి: టీడీపీ

హైదరాబాద్, విజయవాడబుధవారం టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. కిరణ్ సర్కార్ జగన్‌ను చంచల్‌గూడ జైల్లో కొత్త అల్లుడి మాదిరిగా చూసుకుంటోందని, వారిద్దరూ క్విడ్ ప్రో కో మాదిరిగా పరస్పరం ఇచ్చి పుచ్చుకొని ఒకరినొకరు కాపాడుకొంటున్నారని దేవినేని ఉమా విమర్శించారు. "ప్రత్యేక వాహనాల్లో అధునాతన పరికరాలు పెట్టి.. వాటిని జగన్ గది సమీపంలో ఉంచుతున్నారు. జగన్ శాటిలైట్ ఫోన్ల ద్వారా ఈ పరికరాల సాయంతో జైల్లోంచే అందరితో మాట్లాడుతున్నారు. జైల్లో జగన్‌కు ఇబ్బంది కలుగకుండా ఒక్క క్షణం కూడా కరెంటు పోనివ్వడం లేదు. పోయిన మరుక్షణమే జనరేటర్ వేస్తున్నారు'' అని పేర్కొన్నారు.

జగన్ ఏకంగా జైలు సూపరింటెండెంట్ గదినే తన చాంబర్‌గా వినియోగించుకుంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం కిరణ్, జగన్‌తో లాలూచీ పడ్డారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. జైల్లో జగన్ దందాపై తమకు 15 పేజీల లేఖ అందిందని చెప్పారు. "జైలు సూపరింటెండెంట్ జగన్ సేవలో తరిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు జగన్‌కు తన సీటు అప్పగించి సూపరింటెండెంట్ బయట తిరుగుతుంటారు. ఆ కుర్చీలోనే కూర్చుని జగన్ తన కోసం వచ్చిన వారిని కలుస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 400 మందిని కలుస్తున్నారు. రోజూ జగన్‌కు పంపే వంటకాలనే ఖైదీలందరికీ వడ్డిస్తూ ఉదారత చాటుకుంటున్నారు'' అని వర్ల రామయ్య ఆరోపించారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, చంచల్‌గూడ జైల్లో ఏం జరుగుతోందో దర్యాప్తు చేయించే దమ్ము, ధైర్యం సీఎంకు, హోంమంత్రికి లేవని విమర్శించారు. చంచల్‌గూడ జైలు అధికారులను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. "రిమాండ్ ఖైదీలు చంచల్‌గూడ జైల్లో జరుగుతున్న ఈ వైభోగాల గురించి విని తమను అక్కడికే పంపాల్సిందిగా జడ్జిలను వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాజీ కేంద్ర మంత్రి రాజా, కనిమొళి, సురేష్ కల్మాడీ, మధుకోడా వంటి వారు జైళ్లలో చిప్పకూడు తిని గడిపితే... జగన్‌కు మాత్రం రాజభోగాలు కల్పిస్తున్నారు'' అని రామయ్య విమర్శించారు. డీజీపీ అయినా జైలుకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు.
: చంచల్‌గూడ జైలు వైసీపీ ప్రధాన కార్యాయలంగా మారిందని.. అక్కడ జగన్‌ను కొత్త అల్లుడిలా చూసుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. సీఎం కిరణ్, వైఎస్ జగన్ పరస్పరం ఒకరినొకరు కాపాడుకుంటున్నారని పేర్కొంది. జైల్లో నుంచి జగన్ శాటిలైట్ ఫోన్ల ద్వారా అందరితో మాట్లాడుతున్నారని, జైలు సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని తన కోసం వచ్చేవారిని కలుస్తున్నాడని ఆరోపించింది.