April 11, 2013

విద్యుత్ సంక్షోభానికి వైఎస్సే కారణం

నర్సీపట్నం టౌన్ : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, వైఎస్ తన స్వార్థరాజకీయాల కోసం విద్యుత్ వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు.

ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నదని, విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకిస్తున్నారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌లో సోలార్ విద్యుత్‌కు కేవలం రూ.8 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. విద్యుత్ కొరతతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయ్యన్న పాత్రుడు విమర్శించారు.