April 11, 2013

టీడీపీ గెలుపు ఖాయం..

కాకినాడ,:చంద్రబాబు పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ప్రజల్లో ఆలోచన మొదలయింది. గ్రామస్థాయి నుంచి టీడీపీ హయాంలో సంక్షేమం, వైఎస్, కాంగ్రెస్ అవినీతిపై జనం బేరీజు వేసుకుంటున్నారు.. అని టీడీపీ ప్రధాన కార్యదర్శి, వస్తున్నా మీకోసం పాదయాత్ర రథసారధి గరికపాటి మోహనరావు అన్నారు. అక్టోబరు 2 నుంచి పాదయాత్రలో చంద్రబాబు వెంట నడుస్తున్న గరికపాటి ఈ ఆరునెలల వ్యవధిలో తన అనుభవాలు, పాదయాత్ర స్పందనపై ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వివరించారు.
హిందూపురంలో ప్రారంభమైన పాదయాత్ర తూర్పుగోదావరి వచ్చేటప్పటికి ఉప్పెనలా స్పందన వస్తుందన్నారు. జిల్లా జిల్లాకు జనస్పందన అనూహ్యంగా పెరుగుతుందన్నారు. మన నాయకుడు కష్టపడుతున్నాడు మనం కూడా కష్టపడాలి .. అన్న భావన టీడీపీ నేతలు, కార్యకర్తలలో బాగా చొచ్చుకుపోయిందన్నారు.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రలో చంద్రబాబు వాగ్దానాలు ఆచరణ సాధ్యమయ్యేవేనా?

గరికపాటి: చంద్రబాబు ఆచరణ సాధ్యంకానివి ఏవీ మాట్లాడరు. ఆర్ధిక నిపుణులు, పార్టీ సీనియర్లతో చర్చించిన వాటిపైనే హామీలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల వరకు వెళ్తుంది. బీసీ డిక్లరేషన్‌కి రూ 10 వేలకోట్లు, కాపుల్లో పేదలకు ఏటా రూ వెయ్యికోట్లు, రైతులకు, చేనేత రుణమాఫీ, ఇలా పేదలకోసం చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలుచేయలేనివి మాత్రం కాదు.

ఆంధ్రజ్యోతి: నాయకుల పనితీరుపై అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి?

గరికపాటి: కిందిస్థాయిలో కార్యకర్తలు బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల నాయకుల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నాం. పనితీరు బాగాలేని నాయకులకు ప్రాధాన్యత ఉండదు. ప్రజలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న వారిని మేమెలా ప్రోత్సహిస్తాం.

ఆంధ్రజ్యోతి: పాదయాత్ర ఏప్రిల్ 27తో ముగుస్తుంది? తర్వాత బస్సు యాత్ర అంటున్నారు?

గరికపాటి: 16 జిల్లాలలో పాదయాత్ర 27తో ముగుస్తుంది. తర్వాత జూన్ నుంచి రెండో విడత యాత్ర ఉంటుంది. అది ఇంకా పూర్తిగా ప్లాన్ చేయాలి. ఎన్నికలలోగా చంద్రబాబు 294 నియోజకవర్గాలలో తిరిగి కార్యకర్తలతో మమేకమవుతారు.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రలో చంద్రబాబు రికార్డు నెలకొల్పుతున్నట్లున్నారు?

గరికపాటి: ఔను. దేశచరిత్రలో ఇన్ని కిలోమీటర్లు నడిచి ప్రజాసమస్యలు తెలుసుకున్న రాజకీయనాయకుడు ఎవరూలేరు. ఇప్పటికే 2,,650 కిలోమీటర్లు సాగింది. మరో ఇరవై రోజులు పాదయాత్ర ఉంది.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రకు వస్తున్న స్పందన ఎలా ఉంది?

గరికపాటి: అక్టోబరు 2న హిందూపురంలో ప్రారంభించినపుడు.. స్పందన బాగానే ఉంది. క్రమక్రమంగా బాగా పుంజుకుంది. ప్రజలు చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారు.

ఈ ప్రభుత్వ చేతకాని తనం, అవినీతికి విసిగివేసారిపోయారు. గతంలో టీడీపీ హయాంలో విద్యుత్, ఐటీ, ఇతర సంస్కరణలు, ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల పనితీరు.. ఇలా అన్నింట్లోనూ అప్పటి పాలనతో పోల్చుకోవడం మొదలైంది. దీంతో చంద్రబాబు పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది.

ఆంధ్రజ్యోతి: పాదయాత్ర వల్ల పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటారా?

గరికపాటి: ఖచ్చితంగా. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలపు ఖాయం. . ఈ 188 రోజులు నేనూ ఈ యాత్రలో ఉన్నాను. .టీడీపీ కార్యకర్తలే కాకుండా గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా చంద్రబాబును చూడటానికి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత బాగా స్పందిస్తున్నారు. చంద్రబాబు సంక్షేమాల గురించి, విద్యుత్ సంస్కరణలపై ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు.