April 11, 2013

అసమర్థ ప్రభుత్వమిది: ఉమా


మైలవరం: రాష్ట్రంలో అసమర్థ్ధులు రాజ్యమేలుతున్నారని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరంలో మంగళవారం నాటి బంద్‌ను పర్యవేక్షించి టీడీపీ, సీపీఎం నాయకులు నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని ఉమా ఆరోపించారు. మరోపక్క విద్యుత్‌కోతల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నవంబర్ 15 నాటికి సాగరుజలాలు రావాల్సి ఉండగా నేటికీ అతీగతీలేదన్నారు. విద్యుత్‌చార్జీల భారాన్ని తగ్గించాలని ఆందోళనలు, బంద్‌లు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు.

రాస్తారోకోలో సీపీఎం నాయకులు పీవీ ఆంజనేయులు, జానీ, కృష్ణారెడ్డి, సాల్మన్‌రాజు, టీడీపీ నాయకులు గొల్లపూడి, వెంకటనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం రిలే దీక్షా శిబిరానికి చేరుకున్న ఉమా రిలే దీక్షాపరుల్ని పరామర్శించారు. విద్యుత్‌చార్జీలు తగ్గించాలంటూ గత 13 రోజులుగా టీడీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. మంగళవారంతో దీక్షలు ముగించినట్లు ఉమా తెలిపారు. మంగళవారం బూదేటి, వెంకయ్య, బాబూరావు, వినయ్‌కుమార్‌లు దీక్షలో పాల్గొన్నారు.