April 10, 2013

పల్లె బాటే ముళ్లబాటా!

పల్లె నుంచి ఎవరైనా కొత్తగా పట్నానికి వస్తే 'ఎర్రబస్సు' ఎక్కి వచ్చావా అని ఎగతాళి చేస్తారు. పట్నం మర్యాదల ప్రకారం నడుచుకోనివారి విషయంలో తరచూ ఈ మాట వింటూ ఉంటాం. అది తప్పా ఒప్పా అనేది వేరే చర్చ! కానీ, ఆ ఎర్రబస్సు ముఖం కూడా చూడని పల్లెలను ఏమనాలి? ఏసీలు, వీడియోలు, దుప్పట్లు, దిండ్లు వంటి పడక సౌకర్యాలతో అతి విలాసవంతమైన సర్వీసులను నడిపే ఆర్టీసీకి, ఈ పల్లెలు నష్టజాతకంగా కనిపిస్తున్నాయా? "చెయ్యి ఎత్తండి..బస్సు ఎక్కండి'' అంటూ గొప్పగొప్ప నినాదాలను ఒకవైపు గుప్పిస్తూ.. మరోవైపు చెయ్యి కాదు కదా.. చేతులు జోడించి ప్రార్థించినా ఈ పల్లెల్లో బస్సు ఆగడం లేదు.

మండల కేంద్రంలో ఎన్ని పిటిషన్లు పెట్టినా బస్సు చక్రం పల్లెలపైపు తిరగడం లేదు. ఎందుకు? "మా ఊరికి బస్సు నడిపితే సంస్థకు నష్టమట సార్!'' అని ఆ యువకుడు చెప్పాడు. తుని పోవడానికి అతడు ఆటో కోసం రోడ్డు మీదకు వచ్చాడు. " తునికి పోయి రావడానికి 40 రూపాయలు కావాలి సార్. ఈ కరువు రోజుల్లో అంతపెట్టి ప్రయాణాలు ఏమి చేస్తాం? ఎన్నిసార్లు అడిగినా ఆర్టీసీ వాళ్లు బస్సు తిప్పడం లేదాయె'' అంటుంటే గొంతులో అసహనం ధ్వనించింది. వందల కోట్ల నష్టాలతో ఉన్న ఆర్టీసీకి, 'పల్లె బాటే' ముళ్ల బాట అవుతున్నదా!

ఎక్కడో దూరంగా విసిరేసినట్టు అక్కడో గ్రామం..ఇక్కడో గ్రామం.. తుని రూరల్‌లో పరిస్థితి ఇది. ఒక ఊరు దాటితే కొన్ని కిలోమీటర్ల వరకు పంటపొలాలు.. సాగుపనులు చేసుకుంటున్న రైతులే కనిపిస్తారు. ఎక్కువగా పామాయల్, జీడిమామిడి, చెరుకు పండిస్తున్నారు. అక్కడక్కడ కూరగాయల తోటలు కనిపించాయి. అలాంటి ఒక తోటలో అచ్చంగా మహిళలే పనిచేస్తుండటం ముచ్చటగొలిపింది. 'ఎంత చేసినా ఏముంది సార్! పేరాపెంపా! తాగుబోతు మొగుడూ, తంటాలు పెడుతున్న ఈ సర్కారూ మా పాలిట ఒకేలా తగలడ్డారు'' అని ఆక్రోశం వెలిబుచ్చారు. వీళ్ల కన్నీరు హైదరాబాద్ పెద్దలను ముంచెత్తేదెన్నడో!