April 10, 2013

దొంగల పక్కన ఎన్టీఆరా? కాంగ్రెస్‌పై పోరులో రాజీపడని నేత ఆయన

అలాంటి నేత ఫొటో వైఎస్‌తో చూస్తే బాధేస్తోంది
వైఎస్ అవినీతిపై ఫ్లెక్సీలు పెట్టాలి..
అప్పుడైనా సిగ్గు వస్తుందేమో..
పార్టీ శ్రేణులకు బాబు పిలుపు

కాకినాడ : "కాంగ్రెస్ పార్టీపై చివరి వరకు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి ఫొటోను అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ ఫొటో పక్కన పెడతారా? ఎన్టీఆర్ వారసులమంతా దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముదిరిన 'ఫ్లెక్సీ'ల వివాదంపై  పాదయాత్రలో ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన వైఎస్ లాంటి దొంగల ఫొటోపక్కన ఎన్టీఆర్ ఫొటో చూస్తే బాధేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇది దివాలాకోరు రాజకీయం. రాజకీయాల్లో విలువలు పడిపోయాయి. మహాత్మాగాంధీ, జ్యోతీరావు ఫూలే , అంబేద్కర్, ఎన్టీఆర్..ఇలాంటి మహానుభావుల ఫొటోలు చూస్తే ఒక స్ఫూర్తి. వైఎస్‌ను చూస్తే ఏం గుర్తుకొస్తుంది? లక్ష కోట్లు దోశాడని గుర్తుకొస్తుంది. ఎన్టీఆర్ చివరి వరకు కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేశారు. మనమంతా ఆయన వారసులం'' అని కార్యకర్తలతో అన్నారు. వైఎస్ కుటుంబ అవినీతిపై ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేయాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. "అప్పుడైనా వారికి సిగ్గు వస్తుందేమో తమ్మూళ్లూ!'' అని వ్యాఖ్యానించారు.

వైఎస్ సీఎంగా వున్నపుడు ఆయన అరాచకాలపై సోనియా, మన్మోహన్‌సింగ్‌లు మౌనం వహించడం వల్లనే ఆయన చెలరేగిపోయారని విమర్శించారు. కాగా, విద్యుత్ సమస్యలపై టీడీపీ పిలుపునకు స్పందించి బంద్ విజయవంతం చేసిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సమస్యలు తీరేవరకు ఉద్యమం ఆగదన్నారు. కాగా, 189 రోజులుగా పాదయాత్ర చేస్తూ వందల సభలలో ప్రసంగాలు చేస్తూ, సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గొంతు బొంగురుపోయింది. " ఎక్కువగా మాట్లాడటం వల్ల గొంతుపోయింది. మీరే మాట్లాడండం''టూ తునిలో ప్రజలతో అన్నారు.