April 10, 2013

అన్నింట్లో జగనే 'ఏ-1'! అదే ఆ తండ్రి కోరిక.. అందుకే దోపిడీ, అక్రమాల్లో ఫస్ట్

కాకినాడ: " వైఎస్ రాజశేఖరరెడ్డి తన కుమారుడు జగన్మోహనరెడ్డిని 'ఏ-1'గా చూడాలనుకున్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలలోనూ జగన్ ప్రథముడిగా ఉండాలనుకున్నారు. దొంగ కంపెనీల్లోనూ చలాయించుకు రావాలని ఆశించారు. అవన్నీ కలగలిసి ఇప్పుడు జగన్ నిజంగానే 'ఏ-1'గా మిగిలారు. సీబీఐ చార్జిషీట్లన్నింట్లోనూ ఆయనదే తొలి పేరు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని వి.కొత్తూరులో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తుని, కుమ్మరిలోవల మీదుగా నడక సాగించారు.

వెలమ కొత్తూరులో ఓ రైతు పొలంలోకి వెళ్లి టమోటా పంటను పరిశీలించారు. అనంతరం ఆ ఊరి నడుమ జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులపై సీబీఐ చార్జీషీట్లు దాఖలు కావడం, వైఎస్ హయాంలో చోటు చేసు కున్న కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు. "సీఎంగా ఉన్నపుడు వైఎస్ రాష్ట్ర సంపదను దారుణంగా దోచుకున్నారు. జగన్‌కి లక్ష కోట్ల లబ్ధి చేకూర్చారు. ఈ పనిలో వైఎస్‌కు సహకరించిన మంత్రులు, అధికారులంతా ఇప్పుడు చంచల్‌గూడ జైల్లోకెళ్లారు'' అని దుయ్యబట్టారు. జగన్‌కు అన్యాయం జరిగిందన్న వైఎస్ విజయలక్ష్మి వ్యాఖ్యలపై తీవ్రం గా స్పందించారు.

" కొడుక్కి అందరూ అన్యాయం చేస్తున్నారని ఆ తల్లి గగ్గోలు పెడుతోంది. అసలు తన కొడుకు వల్ల ఎంతమంది ఐఏఎ స్‌లు జైలుకెళ్లారో ఆమె తెలుసుకోవాలి'' అని అన్నారు. దేవుడంటూ వైఎస్‌కు విగ్రహాలు పెట్టేవారు.. ఆయన వల్ల ఎవరికి మేలు జరిగిందో చెప్పాలన్నారు. నిన్న అధికారులు, ఇప్పుడు మంత్రులు జైలు దారి పట్టడానికి గానీ, చివరకు తన కుమారుడు జైలుకెళ్లడానికి గానీ వైఎస్సే కారణమని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ నిండా నేరస్థులేనని ఆరోపించారు.

అవినీతి సొమ్ముతో పెట్టిన జగన్ పేపర్, టీవీలను చూడొద్దని విజ్ఞప్తి చేశారు.కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ధర్మంగా గెలిచారని, టీడీపీ కూడా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అక్రమాలపై విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించతలపెట్టిన పైలాన్‌కు ఎట్టకేలకు మంగళవారం స్థల ఎంపిక పూర్తయింది.

గాజువాక దగ్గరలోని వడ్లపూడిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పెట్రోల్ బంక్ వద్ద 1200 చదరపు గజాల విస్తీర్ణంలో పైలాన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దుర్ముహూర్తం ముంచుకొస్తున్నదంటూ సాయంత్రం 5:30 గంటలకు శంకుస్థాపన చేశారు. అలాగే.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 27వ తేదీ ముగింపు సభను నిర్వహించాలని నిర్ణయించారు.