April 10, 2013

'తూర్పు' మడిలో కన్నీటి తడి!

బంగారు భూమి.. తూర్పుగోదావరి జిల్లా అనగానే మెదిలే భాగమిదే. గలగల గోదారి వొరిపిడికి జలజల దిగుబడి రాలుతుందని అనుకుంటారు. ఈ పల్లె లోతుల్లోకి నడుచుకుంటూ వెళ్లకపోతే.. నేనూ అలాగే అనుకునేవాడినేమో! పత్తి పొలంలోకి వెళ్లి దిగాలుపడిన ఆ రైతు భుజంపై చెయ్యి వేయకపోతే.. ఈ నేలకు మడే కాదు కన్నీటి తడి కూడా తెలుసునని నమ్మలేకపోయేవాడినేమో!

బొట్టు బొట్టుగా పాదుల్లోకి నీళ్లు.. మోటారు బావికి అతుక్కుపోయిన రైతు కళ్లు..బీడువారుతున్న పొలాన్ని, బతుకుని చూసి పొంగుకొచ్చే కన్నీళ్లూ..అనంతకో, పాలమూరుకో మాత్రమే కాదు.. గోదారి జిల్లాలకూ అనుభవమే! చెలమకొత్తూరు, తుని ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు బీడు పొలాలు కనిపించాయి. పోలవరం పూర్తి కాదు..పుష్కర కాలువకు గ్రహణం తొలగదు... మరి ఏం చేయాలి? పత్తిరైతు నుంచి టమోటా సాగుదారు దాకా అందరి ప్రశ్న ఇదే. తెల్లబంగారం ఇస్తున్న దనుకున్న సాగు..తెల్లబట్టను మిగిల్చింది.

వి.కొత్తూరు పొలిమేరల్లో కూరగాయల సాగు రైతులను కలిశాను. కరెంటు వేటుకు అయిన గాయాలను వారంతా చూపిం చారు. కాయలను చూపించారు.. ఎండిన బావులను చూపించారు.. మోటారు మూల్గు లను చూపించారు. ధర తెస్తుందనుకున్న టమోటా చప్పగా చితికిపోయిందని వాపో యారు. అంత పెట్టుబడికి ముట్టింది మూడు రూపాయలని (కిలో) ఖాళీ చేతులను చూపిస్తూ భోరుమన్నారు. ఇది భూమి శాపమో, భూ పాలకుల కోపమో అర్థం కావడం లేదంటుండగా, గొంతుకలు పూడుకుపోయి మాట్లాడలేకపోయారు. ఇక వీళ్లకు నేనే గొంతుక కావాలి!