March 10, 2013

వైఎస్ దోచేస్తే..కిరణ్ పన్నులతో బాదేస్తూ..

గుడివాడ : రాష్ట్రాన్ని వైఎస్సార్ దోచేస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కైకలూరు మండలం ఆలపాడులో శనివారం మైలవరం, కైకలూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ప్రజలు సమస్యలతో మగ్గుతున్నారు. అరాచిక శక్తులు అధికారంలో అర్రులు చాస్తున్నాయి. వీటిని సంహించలేక ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కష్టపడితే అధికారం మనదేనన్నారు. చంద్రబాబు సమావేశంలో ఎక్కువ సమయం కార్యకర్తలకే కేటాయించారు. పాదయాత్రకు సమయం కావడంతో ముఖాముఖిలో కొద్ది మందికే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో కార్యకర్తలు పలు సూచనలు చేశారు. రుణమాఫిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తులు కుంటు పడిన విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళాలన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరారు.అనంతరం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వలలో నాయకులు లొంగుతున్నారు గానీ, కార్యకర్తలు ఎవరూ లొంగడం లేదన్నారు. మైలవరం, కైకలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారని వారికి అండదండగా నిలిచి కార్యకర్తలు ఆహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందే నియోజకవర్గ, ఏరియా, బూత్ ఇన్‌ఛార్జీల ద్వారా పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తానన్నారు. విద్యుత్ కోత, సర్‌చార్జీల పేరిటభారం, అధిక ధరలు, నిరుద్యోగం లాంటి విషయాలను కూడా నియోజకవర్గంలో ప్రచారం చేయాలన్నారు. ఈ క్రమంలో కమిటీలు పని చేస్తేనే పార్టీ పటిష్ఠంగా ఉంటోందన్నారు.జగన్‌పార్టీకి తెలంగాణలో సీన్ లేదని, టీఆర్ఎస్ సహకార ఎన్నికల్లో చతికల పడిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని చంద్రబాబు అన్నారు. నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న స్పర్థలుంటే సర్థుబాటు చేసుకోవాలన్నారు.

మొత్తం మీద అధినేత కార్యకర్తలు పార్టీ మనుగడకు ఢోకా లేదని గెలుపు కష్టం కాదని నిర్ణయానికి వచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.