March 10, 2013

రాష్ట్రాన్ని 'మద్యం'ప్రదేశ్‌గా మార్చిన కాంగ్రెస్

భీమవరం/ఆకివీడు రూరల్/ఆకివీడు: రాష్ట్రాన్ని 'మద్యం' ప్రదేశ్‌గా మార్చి ప్రజలందరి రక్తాన్ని పీల్చుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం సీఎం హైస్కూల్ వద్ద ప్రారంభమైన యాత్ర ఆకివీడు మండలం అజ్జమూరు మీదుగా ఉండి మండలంలోకి ప్రవేశించింది. అజ్జమూరు గరువు వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

కష్టాలు మరిచేందుకు పేదవాడు ఒక పెగ్ మందుతాగితే దానిని కాంగ్రెస్ సర్కారు హాఫ్ వరకు తాగించేందుకు అడుగడునా బెల్ట్‌షాపులు పెట్టారని, దీంతో పేదవాడి జేబు ఖాళీకావడమే కాకుండా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే రెండో సంతకం బెల్ట్‌షాపుల రద్దుపై చేస్తానని హామీ ఇచ్చారు.

జుట్టుపై కూడా పన్ను వేస్తారు.. తొమ్మిదిన్నరేళ్ళ కాంగ్రెస్ పాలనలో అన్నిరకాల వస్తువులు భారీగా పెరిగిపోయాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు, నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇలా అన్నింటిపైనా ట్యాక్సులు వేసి భారీగా ఖజానా నింపుకుని వాటిని ప్రజా సంక్షేమానికి మాని కాంగ్రెస్‌వారి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. తమ్ముళ్ళు మీరు ఊరుకుంటే జుట్టుపై కూడా పన్ను వేస్తారని చమత్కరించారు.

పాలనను గాడిలో పెట్టాలని.. గాడితప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు తన ఆరోగ్యం సహకరించకున్నా, ఇబ్బందులు పడుతున్నా 160 రోజులుగా పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. అధికారం నాకు కొత్తకాదని, పేదవాడికీ, తెలుగువాడికి న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతీ గ్రామానికి మంచినీరు అందిస్తామని, ఇళ్ళు లేని ప్రతీ పేదవాడికి రూ.లక్ష ఖర్చుపెట్టి ఇళ్ళు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కలవపూడి శివ, జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మీ, వైటి రాజా, కొక్కిరిగడ్డ జయరాజు, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ శ్రీను), మోటుపల్లి రాజు, మోటుపల్లి ప్రసాద్, బొచ్చు కృష్ణారావు, భూపతిరాజు తిమ్మరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, గొంట్ల గణపతి, పాల్గొన్నారు.