March 10, 2013

జనం వరద



ఏలూరు : శివరాత్రి పర్వదినాన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పశ్చిమ ప్రజలు దీవెనలు ఇచ్చారు. ఆయన పాదయాత్రలో అడుగులో అడుగు వేశారు. అభిమానం కురిపించారు. వరదలా ఆయన వెంట సాగారు. వెల్లువెత్తిన ఉత్సాహం ముందు బాబు సైతం 12 కిలోమీటర్ల తన ప్రయాణంలో తొమ్మిది కిలోమీటర్లను నాలుగున్నర గంటల వ్యవధిలోనే అలవోకగా దాటేశారు. అర్జమూరు నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఆయన పాదయాత్ర నిండుగానే సాగింది. పార్టీ శ్రేణులను పసుపు రంగుతో కనువిందు చేసింది. ఉదయాన్నే శివరాత్రి పండుగను చేసుకున్న జనమంతా సాయంత్రం నాటికల్లా చంద్రుడి వెంట కదిలారు. తొలిరోజు చాలా నెమ్మదిగా సాగిన బాబు యాత్ర ఆదివారం మాత్రం అత్యంత వేగంగా, ఉత్సాహంగా ముందుకు సాగింది. అర్జమూరులో గుమ్మిగూడిన ప్రజలు బాబూ మాట్లాడండి అంటూ పట్టుబట్టారు.

హారతులిచ్చారు, ఆయనకు చేరువయ్యేందుకు పోటీలుపడ్డారు. యువకులు కేరింతలతో ఆయనకు దన్నుగా నిలిచారు. ఎవరూ వాహనాలు ఎక్కకుండా నేరుగా ఆయనకు తోడుగా అర్జమూరు నుంచి ఉండి వరకు ముందుకు సాగుతూ వచ్చారు. తన రెండోరోజు పశ్చిమయాత్రలో చంద్రబాబు వినూత్నంగా కూడా వ్యవహరించారు. ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలతో పాటు వారి స్థితిగతులను అడిగి తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీలో ఎవరైనా కోటి రూపాయలు చూశారా, కనీసం లక్ష రూపాయలు చూశారా, 500 కట్టలు చూశారా, లేదా వంద రూపాయలను చూశారా అంటూ ప్రశ్నలు అడుగుతుంటే జనం నుంచి లేదు లేదు అనే జవాబు వచ్చింది. వెయ్యి లారీల లోడు ఉన్న లక్ష కోట్లను జగన్ వెనకేసుకున్నాడు. వై. ఎస్ తన కొడుకుకి ఇచ్చిన సంపద ఇది. మీలాంటి పేదవాళ్లు అన్ని కోట్లు చూసే అవకాశం ఎలా రాగలుగుతుందంటూ వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఎవరి మీదా నాకు కోపం లేదు, ధ్వేషం లేదు, ఈర్ష్య లేదు, మీరు పడుతున్న బాధలను చూసిన తర్వాతే ఇలా ముందుకు సాగాలనిపించి వచ్చాను అని చెప్పుకొచ్చారు.

గీత కార్మికులను, పండ్లు అమ్ముకునే వారిని, ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులను భుజం తట్టి పలకరించారు. 'అయ్యా.. మాకు దిక్కు లేదు. గుడిసెలోనే ఉంటున్నాం. కనీసం ఇల్లు కూడా లేదు. ఏం బతుకయ్యా మాది' అంటూ చెరుకువాడలో ఓ మహిళ కన్నీటి పర్యంతమైనప్పుడు 'అమ్మా తప్పకుండా ఇల్లు కట్టిస్తాం. బాధపడొద్దు' అంటూ ఓదార్చారు. బాబుగారు.. అప్పుల్లో ఉండిపోయాం. బ్యాంకుల్లో ఉన్న అప్పులను మాఫీ చేసేయండి.. మా బతుకు మేం బతుకుతాం' ఇది మరో మహిళ నుంచి వచ్చిన ఆవేదన. ఇంకొక దగ్గర 'మీరు రైతుల్లో రుణాలు మాఫీ చేస్తాం అంటున్నారు. అదే జరిగితే మాకే కొండంత సంతోషం' అని రైతులు పేర్కొన్నప్పుడు కూడా నా తొలి సంతకం రుణా మాఫీపైనేనని, వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా చూస్తానని ధైర్యాన్ని ఇచ్చారు. చెరుకువాడ నుంచి ఉండి వరకు మార్గమధ్యలో ఆయనకు పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎదురేగి తమ కష్టాలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. కలశిపూడిలో శివుడిని దర్శించుకున్నారు. చంద్రబాబు సీ ఎం కావాలని స్థానికులు అక్కడ దీవెనలు అందించారు. పెదపుల్లేరు అడ్డరోడ్డు వద్ద దివంగత సీనియర్ నేత అబ్బాయిరాజును చంద్రబాబు స్మరించారు.

ఆయన లేని లోటును గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులను ప్రస్తావిస్తున్నప్పుడు ఓ బాలిక ఆయనకు తాజాగా వచ్చిన బిల్లులును అందిస్తూ 'ఇంత బిల్లు ఎలా కట్టాలిసార్' అంటూ బాబు ముందు గోడు వెళ్లబోసుకుంది. ఇప్పుడు జగన్ వంటివాళ్లు దోచుకున్న సొమ్మును మీరు రికవరీ చేయగలుగుతారా అని ఉండిలో కొందరు ప్రశ్నిస్తే.. ఇతర ర్రాష్టాల్లో ఇప్పటికే ఇది సాధ్యమైంది. తప్పకుండా అధికారంలోకి వస్తే తిన్న వాటిని కక్కిస్తాం. ఆ సొమ్ము ప్రజల కోసమే ఖర్చుపెడతానంటూ తిరుగు సమాధానమిచ్చారు. అర్జమూరు నుంచి ఉండి వరకు ప్రజలతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు, వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుని తిరిగి వెళ్తున్న వారు చంద్రబాబుకు అభివాదం చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి ప్రతిగా బాబు చేతులు జోడించి ప్రతిఅభివాదం చేస్తూ ముందుకుసాగారు. ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూనే, పార్టీ విధానాలను వివరిస్తూనే, తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చబోతానో చెప్పుకుంటూనే రెండోరోజు యాత్రలో బాబు హుషారు కనబరిచారు.

తెలుగుదేశం ముఖ్యనేతలు రెండవ రోజు ఆదివారం బాబు వెంట ఆసాంతం కొనసాగారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే శివరామరాజు, మాగంటిబాబు, పీతల సుజాత, కొక్కిరిగడ్డ జయరాజు, పాలీ ప్రసాద్, పాందువ శ్రీను, ముళ్లపూడి బాపిరాజు, శశి విద్యాసంస్థలకు చెందిన వేణుగోపాల్, గాదిరాజు బాబు, ఉప్పాల జగదీష్‌బాబు, పెనుమర్తి రామ్‌కుమార్, జూనియర్ ఎం ఆర్‌సి తదితరులు ఉన్నారు.