March 10, 2013

అందరూ పార్టీ కోసం కష్టపడిన వారే



ప్లీజ్.. అర్థం చేసుకోండి
ఎంత మందికి అవకాశం ఇవ్వగలను?
పశ్చిమగోదావరిలో చంద్రబాబు వెల్లడి

"పార్టీ కోసం ప్రాణాలు అర్పించేవారున్నారు. కష్టపడుతున్న వారున్నారు. త్యాగాలు చేస్తున్న వారు ఉన్నారు. నేను సామాజిక న్యాయం కోసం ఒక మాట ఇచ్చాను. ఆ కోణంలోనే ఈసారి ముగ్గురికి అవకాశం ఇచ్చాను. ఇంకా ఎంతమందికి ఇవ్వగలను? మా వాళ్లు అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. "మా పార్టీలో సీనియర్ నాయకుల్లో దాడి వీరభద్రరావు ఒకరు. ఆయనంటే మాకు గౌరవం ఉంది. నిన్న, ఈ రోజు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించా. దురదృష్టవశాత్తు ఆయన మాట్లాడలేదు. ఆయన కూడా ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశించారు. రాలేదన్న బాధవల్లే నాతో మాట్లాడలేకపోయి ఉండొచ్చు'' అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు ఆదివారం సాయంత్రం ఆకివీడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా యనమల రామకృష్ణుడు, శమంతకమణి, మహ్మద్ సలీం పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కలేదని శనివారమే చంద్రబాబు ఎదుట భోరుమన్న వికలాంగుడు కోటేశ్వరరావు ఉదంతాన్ని కూడా చంద్రబాబు విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. కోటేశ్వరరావులా పార్టీలో కష్టపడి పనిచేసే నేతలు చాలామంది ఉన్నారని, వీరికి కచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు.

"ప్రస్తుతం మా బలాన్ని బట్టి.. మూడు ఎమ్మెల్సీ సీట్లకే అవకాశం ఉంది. అన్ని అంశాలూ చర్చించాం. శనివారం సాయంత్రమే ఒక కొలిక్కి వచ్చింది. మూడు ప్రాంతాల్లోని విభిన్నవర్గాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాకే ఈ కసరత్తు పూర్తి చేశాం. ఎవరి విషయంలోనూ రాగద్వేషాలు లేవు. పార్టీలో కొందరికి అన్యాయం, మరికొందరికి న్యాయం జరగదు'' అన్నారు. దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో ఆయన అనుచరులు రాజీనామాలు చేసిన అంశాన్ని ప్రస్తావించగా, బాధతో కొందరు అలా స్పందించి ఉండొచ్చని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి అందరికీ ఒకేసారి అవకాశాలు ఇవ్వలేమని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నానని తెలిపారు.

మహిళా నేతలు కూడా పార్టీ కోసం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారని, వారు కూడా సముచిత స్థానం కోరుకుంటారని.. అందుకే అన్ని వర్గాలకూ ఇకముందు పదవుల్లో అవకాశాలు ఇస్తామని ప్రకటించారు. గుర్తింపు లేదని ఎవరూ అసంతృప్తి చెందొద్దని.. అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి.. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి... ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లలేకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. "నిజమే.. నేను అసెంబ్లీకి వెళ్లాల్సిందే. కానీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఒక యజ్ఞంగా భావించి పాదయాత్ర ప్రారంభించాను. మా పార్టీలో నాతో పాటు అనుభవం ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారు కచ్చితంగా అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టి తీరుతారు. నేనెలాగూ జనం మధ్యనే ఉన్నాను కాబట్టి అక్కడే సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీయడానికి వెనుకాడబోను' అన్నారు.