March 10, 2013

చిత్తూరు నేతలతో లోకేష్

చిత్తూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తన మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చిత్తూరుకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్ ఘన స్వాగతం పలికారు. తొలుత లోకేష్ కాజూరులోని పార్టీ జిల్లా కార్యదర్శి కాజూరు బాలాజి ఇంటిలో తేనీటి విందుకు వెళ్ళారు. అక్కడ బాలాజి కుటుంబ సభ్యులతో కొంత సేపు చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాని, కాజూరు బాలాజి శాలువా, గజ మాలతో సన్మానించారు. అక్కడ నుంచి లోకేష్ నేరుగా లక్ష్మీనగర్ కాలనీలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

లోకేష్‌తో ఫొటోలు తీసుకోవడానికి నేతలు, కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎంపీ దుర్గ, నేతలు దొరబాబు, కఠారి మోహన్, ఇందిర, వైవి రాజేశ్వరి, షణ్ముగం, శ్రీదర్ వర్మ, విల్వనాధం తదితరులతో లోకేష్ కొంత సేపు పార్టీ స్థితిగతులపై చర్చించారు.కాగా, కొంగారెడ్డిపల్లె వద్ద పూతలపట్టు నియోజకవర్గ నేత ఎన్.పి భాస్కర్‌నాయుడు లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.