March 10, 2013

టీడీపికి మతం, కులం లేవు

ఒకటి తల్లిపాము.. ఇంకొకటి పిల్లపాము
అందులో పిల్లపాముకి విషమెక్కువ
కాంగ్రెస్, వైసీపీలపై చంద్రబాబు ధ్వజం
సామాజిక కోటాలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులు
పశ్చిమ పాదయాత్రలో టీడీపీ అధినేత



"కాంగ్రెస్, వైసీపీలు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కాదు. ఒకటి తల్లి పాము.. ఇంకొకటి పిల్లపాము. వీటిలో పిల్లపాముకి విషమెక్కువ'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. " వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్లు కిరికిరిలు చేసి ర్రాష్టాన్నే అధోగతి పాల్జేశారు. అందుకే ర్రాష్టాన్ని బాగుచేద్దామని, ఒక గాటికి తీసుకువద్దామని శరీరం సహకరించకపోయినా మీకోసం వస్తున్నా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తలపెట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగింది. ఆకివీడు నుంచి ఉండి గ్రామం వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభిమానులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

టీడీపీకి మతం, కులం వంటి వివక్ష లేవీ లేవని స్పష్టం చేశారు. బీసీలకు తాము ఒక స్పష్టతతో కూడిన డిక్లరేషన్‌ను ప్రకటించామని, కాంగ్రెస్ వాళ్లు ఇప్పటిదాకా బీసీలకు ఏదైనా చేశారనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అసెంబ్లీలో వంద సీట్లు ఇస్తామని టీడీపీ ప్రకటించిందని.. అంత దమ్ము మరే పార్టీకైనా ఉందా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం ఈ పాదయాత్ర చేయడం లేదని, ప్రజల ఇబ్బందులను గమనించే ముందుకు సాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. "వైఎస్‌కు తాను పెద్దకుమారుడిని అని గాలి జనార్దన్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆయనేమో ర్రాష్టంలో బంగారమే లేనంతగా దోచేశారు. రెండవ కుమారుడు జగన్ లక్ష కోట్లు తినేశాడు'' అని బాబు వ్యాఖ్యానించారు.

వెంకటేశ్వరస్వామికి బంగారం మంచం లేదుగానీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారికి బంగారు మంచం, కంచం ఎలా వచ్చాయో ఓసారి ఆలోచించాలని హితవు పలికారు. "నాకున్నది ఒకే అబ్బాయి. బాగా చదివించి అతణ్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతున్నాను. నా భార్య చిన్న వ్యాపారం చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమే నాకు తిండిపెడుతోంది. మా ఇంట్లో నా భార్యకు, కోడలికి కూడా స్వేచ్ఛ ఇచ్చాను. వాళ్లు కూడా కష్టపడే తత్వాన్నే అలవర్చుకున్నారు'' అని తన కుటుంబం గురించి బాబు చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ ఇంటి స్థలం ఇవ్వాలని అడిగారని.. గజం 30-50 వేలు చేసే స్థలాన్ని వెయ్యి రూపాయలు ఖరీదు కట్టి ఇమ్మని అడిగితే తాను తిరస్కరించానని గుర్తు చేశారు.

ఇప్పుడు వైఎస్ తనయుడు బెంగళూరులోను, లోటస్‌పాండ్‌లోను ప్యాలెస్‌లు కట్టారన్నారు. హైదరాబాద్ వచ్చిన ఎవరైనా తన ఇంటిని, జగన్ ప్యాలెస్‌లను చూసి ఎవరు స్వార్థపరులో అవినీతిపరులో తేల్చిచెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు తనకో అవకాశం ఇవ్వాలని చెరుకువాడ, అర్జమూరు సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై వెనక్కి తగ్గబోమన్నారు. తాగి వచ్చి భార్యలను వేధించే వారి భరతం పడతానని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదవాళ్ల పొట్టకొట్టడంలోను, ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించడంలోనూ కాంగ్రెస్ సీఎంలు పోటీపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. శివరాత్రి కావడంతో తాను బసచేసిన చోటే సతీమణి భువనేశ్వరితో సహా బస్సులోనే పూజలు చేశారు.