March 10, 2013

ఆ పచ్చదనం.. అంతరించే ప్రమాదం

ఆప్యాయతలకు.. అనురాగాలకు.. గోదావరి జిల్లాల ప్రజలు పెట్టింది పేరు! అతిథులు ఎవరు వచ్చినా వారికి మర్యాదలు చేయడం, ఆప్యాయతను పంచడంలో ఈ ప్రాంతానికి సాటి లేదు. అదే సమయంలో.. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధులకు జన్మనిచ్చిన గడ్డ ఇది. ఇక్కడ యాత్ర చేస్తున్నప్పుడు.. ఆ మన్నెం వీరుడి స్ఫూర్తి అడుగడుగునా కనిపిస్తోంది. చెరుకువాడ, కలిసిపూడి, ఉండి.. ఇలా ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా రహదారికి ఇరువైపులా పచ్చగా పరుచుకున్న కొబ్బరి చెట్లు, పంటపొలాలే!

కానీ.. ఈ పచ్చదనం రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న గ్యారెంటీ లేదు. తుఫాను వస్తే పండుటాకులా వణికిపోయే ప్రాంతమిది. చేతికందిన పంట తుఫానుపాలు కావడం ఇక్కడి ప్రజలకు అలవాటైపోయిన విషయం. తడిసిన ధాన్యం తమకు భారం కాకూడదని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిని అయినకాడికి అమ్ముకోవడం ఇక్కడి రైతన్నలకు అలవాటైపోయింది. గోదావరి డెల్టా అని పేరుకేగానీ, ఆ వైభవం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. కాలువల వ్యవస్థ అంతా శిథిలావప్థకు చేరుతోంది.

ఒక్క రైతులనే కాదు.. ఈ ప్రాంతంలో అరటి పళ్లు అమ్ముకునేవాళ్లను, దర్జీలను, ఇటుకలు తయారుచేసే వాళ్లను, కల్లుగీత కార్మికులను కలిశాను. అందరిదీ ఒకటే వ్యధ. ఎవరి పరిస్థితీ బాగాలేదు. 'ఎలా ఉన్నారు' అని అడిగితే.. అందరివీ కన్నీటి కథలే. 'ఇల్లు కూడా లేదు, ఎలా బతకాలయ్యా' అని ఒక మహిళ బోరుమంది. 'బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేకపోతున్నాం.. రుణాలు మాఫీ చేస్తే మా బతుకు మేం బతుకుతాం' అని మరో మహిళ వాపోయింది. వారందరి కష్టాలూ విన్నాక నా కర్తవ్యం మరోసారి బోధపడింది. రుణమాఫీతో పాటు మరిన్ని అడుగులు వేస్తే తప్ప వారి కష్టాలు తీర్చలేననీ.. కన్నీళ్లు తుడవలేననీ అర్థమైంది.