March 10, 2013

మొసలి- కోతి కథతో బాబు చమత్కారం

భీమవరం/ఆకివీడు రూరల్/ఆకివీడు: జిల్లాలో చంద్రబాబు పాదయాత్రలో భాగంగా అజ్జమూరు గ్రామంలో పాదయాత్రలో ప్రసంగిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న తీరుపై కోతి-మొసలి కథ చెప్పారు. ఒక నది గట్టుపై కోతి నివసిస్తుంది. అదే నదిలో ఒక మొసలి కూడా జీవిస్తుంది. కోతి, మొసలిలు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. దీంతో ప్రతీ రోజు మొసలికి కోతి కొన్ని నేరేడు పండ్లు కోసి ఇస్తుండేది. వాటిని కొన్నితిని మరికొన్ని తన భార్యకు తీసుకెళ్ళేది మొసలి. అయితే మొసలి భార్యకు ఒక రోజు దుర్బుద్ది పుట్టింది. ఇంత రుచికరమైన పండ్లు తింటున్న కోతి గుండెకాయ ఎంతరుచిగా ఉంటుందోనంటూ అది తనకు తెచ్చిపెట్టమని భర్తను కోరింది. భార్య కోర్కెను తీర్చేందకు భర్త మొసలి కోతి వద్దకు వచ్చి నదిలో షికారు తిప్పుతానని వీపుపై కూర్చొపెట్టుకుంది. నది మధ్యలోకి వెళ్ళాక దీని కోర్కెను బయటపెట్టింది.

దీంతో కంగుతిన్న కోతి తెలివిగా ప్రవర్తించి అరే నా గుండెను ఈ రోజు చెట్టుపై పెట్టి వచ్చానే ముందే చెబుతే తీసుకువచ్చేదానిని కదా అంటూ వెనక్కి తిప్పాలని కోరింది. దీంతో మొసలి చెట్టువద్దకు తీసుకొచ్చింది. ఆ వెంటనే ఒక్క ఉదుటున చెట్టెక్కిన కోతి ఇన్నాళ్ళు నీలాంటి దుష్టులతో స్నేహం చేశాను ఇకపై ఈ పక్కకు రావద్దని హెచ్చరించింది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల నుంచి అన్నీ లాక్కుని గుండె మాత్రమే ఉంచిందని చమత్కరించారు. మీరు ఆదమరిస్తే తమ్ముళ్ళు ఆ గుండెను కూడా తినేస్తారని అన్నారు.