March 10, 2013

చంద్రోత్సాహం

(విజయవాడ) 'వస్తున్నా.. మీకోసం ..' అంటూ రెండు విడతలుగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు కేడర్‌కు టానిక్ ఇచ్చారు. పార్టీకి పునాదులు... జవసత్వాలను ఇచ్చే కార్యకర్తల స్థైర్యాన్ని పెంచారు. వారిలో ఉత్సాహాన్ని తీసుకు వచ్చారు. పార్టీని నాయకుల కంటే నడిపించాల్సిందే మీరేనంటూ కర్తవ్య పథాన్ని గుర్తు చేసి తట్టి లేపారు. చావులోనూ పోరాట పంథా వీడకండి అంటూ ధైర్యాన్ని నూరి పోశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు, అటు ప్రజల మెచ్చిన నాయకుడిగా అలుపెరగని బాటసారి జేజేలందుకున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి 'డిక్లరేషన్'ను ప్రకటించి తన విజన్ చూపారు. అటు తొలి విడత, ఇటు రెండవ విడత కలిపి 28 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో .. 15 మండలాలలో .. 143 గ్రామాలలో.. 3 మునిసిపాలిటీలు.. ఒక కార్పొరేషన్‌లో 310.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన బాబు జిల్లాలో టీడీపీకి ఒక శక్తి ఇచ్చి వెళ్ళారు.

నీరసం, నిస్సత్తువలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, కార్యకర్తలకు చంద్రబాబు ఊపిరిలూదారు. పాదయాత్రతో ఇటు పార్టీని పటిష్ఠపరచటంతో పాటు.. అటు ప్రజ ల్లో ఎనలేని సింపతి చంద్రబాబు పొందారు. జనవరి 21న జిల్లాలో మొదటి విడత జగ్గయ్యపేట దగ్గర గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు (జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నగరంలో తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలు)లో 7 మండలాలు, 83 గ్రామాలు, 2 మునిసిపాలిటీలు, ఒక మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిపి 17 రోజుల పాటు 155.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనంతరం గుంటూరు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 27న రెండవ విడతగా అవనిగడ్డ మీదుగా జిల్లాకు వచ్చారు. ఈసారి అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలలో 8 మండలాల పరిధిలో 60 గ్రామాలు, 1 మునిసిపాలిటీ పరిధిలో 155.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విరుచుకు పడ్డారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో వారిని చైతన్యవంతం చేసే దిశగా బాబు సఫలీకృతులయ్యారు. తన హయాంలో ఐటీ ఎలా ఉందో చెప్పిన బాబు, ఇప్పు డు ఎలా ఉందో బేరీజు వేస్తూ జనంలోకి చొచ్చుకుపోయారు. రెండవ విడతగా జిల్లాకు వచ్చినప్పుడు చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ప్రతి రోజూ 2 నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలలో పాల్గోనేవారు. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వా రి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే వారు. సలహాలు స్వీకరించారు. వారిలో ఉత్సాహాన్ని తీసుకు వ చ్చారు. ఏడాది పాటు సెలవులు పెట్టి పనిచేయాలం టూ చెప్పారు. అవసరమైతే మీ వంతు ఖర్చు పెట్టండి. తర్వాత నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. శాసనసభలో ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఎలా పోరాడాలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.