March 10, 2013

టీడీపీ డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లండి

చిత్తూరు : వివిధ వర్గాల సంక్షేమం కోసం టీడీపీ తయారు చేయించిన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పార్టీ జిల్లా పరిశీలకుడు,మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటినుంచే తయారు కావాలని కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా వున్నాయన్నారు. సాధారణ ఎన్నికలకు సైతం ఏడాది మాత్రమే గడువుందని,కాబట్టి నాయకులంతా తమ మధ్య ఉన్న మనస్పర్థలు, బిడియాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని, ఇక వైసీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలిసిందేనన్నారు.

సంపాదన తప్ప ప్రజా సంక్షేమం పట్టని జగన్ జీవితం ఇక జైల్లోనే వుంటుందన్నారు.ఈ పరిస్థితుల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం కోసం చంద్రబాబు చేపడుతున్న పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్రతో టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇటీవల జరిగిన కుప్పం టౌన్ బ్యాంకు, సింగిల్ విండో ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలన్నారు. చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ,ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి,హేమలత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్ళి వారిని చైతన్యపరచాలన్నారు.

తొలుత ఎన్‌టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ దుర్గ, మాజీ ఎమ్మెల్యేలు పట్నం సుబ్బయ్య, చదలవాడ కృష్ణమూర్తి, గాంధీ, లలిత కుమారి,నేతలు దొరబాబు,నాని, అశోక్ రాజ్, నరసింహ యాదవ్, శ్రీనాథ రెడ్డి, షణ్ముగం, కఠారి మోహన్, శ్రీధరవర్మ, వై.వి రాజేశ్వరి, పుష్పావతి, పర్వీన్ తాజ్, అశోక్ ఆనంద్ యాదవ్, మాపాక్షి మోహన్, విల్వనాధం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని పరిశీలకుడు కోడెల శివప్రసాద రావు,అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లె శ్రీనివాసులు,గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ సమీక్షించారు.జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం ప్రకటించాల్సి వున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.