March 9, 2013

మీ పెద్ద కొడుకులా వచ్చా!

ఏలూరు:శరీరం సహకరించడం లేదు. ఇబ్బంది పడుతున్నా. మీ పెద్దకొడుకు మాదిరిగా ఈ ర్రాష్ట కుటుంబ భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా నడక మాత్రం ఆపను. ఆశీర్వదించండి. నాతో కలిసి రండి' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పేరిట చంద్రబాబు 159వ రోజైన శనివారం కృష్ణా జిల్లా నుంచి ఉప్పుటేరు దాటి పశ్చిమలో రాత్రి ఏడున్నర గంటలకు కాలిడారు. అక్కడ ఆయనకు వేలాది మంది ఎదురేగి స్వాగతం పలికారు. ఆయనకు అనుకూలంగా దిక్కులు పిక్కటిల్లేలా జై చంద్రబాబు అంటూ నినదించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు, మధ్య వయస్కులు వేలాది మంది ఆయనకు ఎదురేగి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

'మీలో ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహమే ఇన్ని వందల కిలోమీటర్లు నన్ను నడిపించేలా చేసింది. ఇక ముందు కూడా ఇదే ధైర్యంతో, ఇదే ప్రోత్సాహంతో ముందుకే వెళ్తాను' అని చంద్రబాబు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్రాష్ట అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న దొంగల బారి నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడతానంటూ భరోసా ఇచ్చారు. ఉప్పుటేరు వంతెన దాటిన తర్వాత అక్కడ గుమ్మిగూడిన వందలాది మందిని ఉద్దేశించి ఆయన కాస్తంత ఉద్వేగంతోనే ప్రసంగించారు. ప్రత్యేకంగా పోలవరం, కొల్లేరు అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కొల్లేరు వాసులకు సంపూర్ణమైనటువంటి జీవిత భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌లో పెట్టి రైతులను దగా చేస్తున్నారని, ఇప్పటికే డెల్టా రైతులు దెబ్బతిన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పుటేరు వంతెన వద్ద నుంచి ప్రధాన మార్గం మీదుగా దుంపగడప గ్రామానికి బాబు చేరుకున్నారు.

ఈ గ్రామంలో ఆయనకు అడుగడుగునా స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. ఒక చిన్నారికి చంద్రబాబు స్వయంగా నామకరణం చేశారు. మార్గమధ్యలో తనకు కన్పించిన వారిని పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. 'మీరెంత కష్టపడుతున్నారో చూసేందుకే నేను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాను. అనుభవం ఉన్నవాడిని. అన్నీ తెలిసిన వాడిని. నాపాలనలో మీకీకష్టాలు ఉండేవి కావు. ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలను చూస్తుంటే బాధేస్తోంది' అని బాబు తన బాధను వెళ్లగక్కారు. అలాగే అవినీతి అంశాలపైనే ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 'ఈ ర్రాష్టంలో దొంగలు పడ్డారు.

కాంగ్రెస్ దొంగలు పడ్డారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ తేడా లేకుండా తెగ తినేశారు. మనం అధికారంలోకి వస్తే వీళ్లని చూస్తూ వదిలిపెట్టం' అన్నారు. 'నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, ర్రాష్టాన్ని అధోగతి పాల్జేసేందుకే ఇలాంటి వాళ్లంతా తెగబడుతున్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో లబ్దిపొందిన వాళ్లు తిరిగి వాళ్లకు కావల్సిన వారికే పెట్టుబడులు పెట్టి ఇప్పుడు జైళ్లలో కూర్చున్నారు' అని జగన్, ఆయన అనుకూలురును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీకు తెలుసు.. రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో, అందుకే నేను అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నా. కాంగ్రెసేళ్లు మాత్రం ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు అంటూ మీకు చెప్పాల్సిన పని లేదు.

ఎలా చేయాలో, ఏం చేయాలో నాకు తెలుసని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప్పుటేరు దగ్గరే పశ్చిమ లో కాలుపెట్టానోలేదో సూపర్‌గా అదిరిందంటూ వచ్చిన జనాన్ని చూసి ఆ యన సంతోషపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు కూడా వందల సంఖ్యలోనే బాబు యాత్రలో పాలుపంచుకున్నారు. పార్టీ జిల్లా అ ధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మా గంటిబాబు, ఎమ్మెల్యే శివరామరాజు తో సహా ముఖ్యనేతలంతా పాదయాత్రలో పాలుపంచుకున్నారు.

హామీలు వెల్లువ... బాబు తన పాదయాత్ర సందర్భంగా భారీగానే హామీలు ప్రకటిస్తూ ముందుకు సాగారు. డ్వాక్రా సంఘా లు నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరి గి ఆదుకుంటామని భరోసా ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, రైతులకు రుణాలు, సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కాలువల ఆధునీకరణ పనులు, చేపల పరిశోధనా కేంద్రం, పింఛన్ల పెంపు వంటి వాటిని కూడా ఆయన తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు.