March 9, 2013

చూద్దామన్నా..చేద్దామక్కా!

కుప్పం: 'ఏంటన్నా పెద్ద సార్‌వద్దకెళ్లి బాధలు చెప్పుకోవాలా.. నేనేర్పాటు చేస్తా' 'ఏందక్కా.. ఏంది మీ సమస్యలు?' 'మీకేం కావాలి? కెరీర్ కౌన్సెలింగ్ సెంటరే కదా.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పంతో ప్రారంభించి అంతటా విస్తరిస్తాం'..రెండో రోజు పర్యటనలో నారా లోకేష్- గ్రామీణులను, విద్యార్థులను ఉద్దేశించి జరిపిన మాటామంతీలో ఇవి కొన్ని మాత్రమే. తొలిరోజుకు భిన్నంగా ఆయన ప్రజలతో, విద్యార్థులతో మమేకమైపోయి చేసిన ప్రసంగాలు ఆకట్టుకు న్నాయి.కుప్పంలోని రహదారులు- భవనాల శాఖ అతిథి భవనంలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించడంతో ప్రారంభమైన లోకేష్ రెండో రోజు పర్యటన తిరిగి సాయంత్రం అదే అతిథి గృహంలో నిర్వహించిన కుప్పం నియోజకవర్గ టీడీపీ ఏరియా కన్వీనర్ల సమావేశంతో ముగిసింది. ఆర్ అండ్ బి అతిథి గృహంలో కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆద్వర్యంలో పలువురు యువకులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత ఆయన గుడుపల్లె మండలం సంగనపల్లె వెళ్లారు.

సుమారు గంట సమయంపాటు ఇక్కడే గడిపారు. మహిళలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త బాలప్ప ఇంటికి వెళ్లి ఆయన అమ్మానాన్నలను పరామర్శించి ఓదార్చారు. అక్కడినుంచి తిరిగి వచ్చే సమయంలో అదే వీధిలో ఉన్న చాలామంది గ్రామస్థులు, పిల్లలు ఆయనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహపడ్డారు. అక్కడినుంచి గ్రామం నడిబొడ్డుకు వచ్చిన ఆయన, గ్రామీణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలన్నింటినీ ఓపిగ్గా విన్నారు. ముందు తాను మాట్లాడకుండా గ్రామీణులచేత మాట్లాడించారు. మరీ ఎక్కువ సమస్యలను ఏకరువు పెట్టిన మహిళలను 'మనం అధికారంలో లేమమ్మా.. అన్ని సమస్యలూ మనం తీర్చలేం..' అంటూ చిరునవ్వుతోనే నిలువరించారు.

ఇంజినీరింగు, ఇతర సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు మొదట తన కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి ప్రయత్నిస్తానని, తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయంతోపాటు స్థానిక కుప్పం ఇంజినీరింగు కళాశాలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడినుంచి బయలుదేరి రాళ్లగంగమాంబ ఆలయంవద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి చేరుకున్నారు. ఎంపీ శివప్రసాద్ వంటి వక్తలు మాట్లాడిన తర్వాత తానేం మాట్లాడలేనంటూనే, అధికార కాంగ్రెస్, వైసీపీలపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు సమర్థ నాయ కత్వంతోనే రాష్ట్రంలో అవినీతి రహిత అభివృద్ధి సాధ్యమవుతుందని ఊరించారు. ముంచుకొస్తున్న ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ మధ్యలో చెట్టు కింద చదువులు సాగిస్తున్న గుడుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల వద్దకు వాహనం ఆపించి మరీ వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పం లో జరిగిన తెలుగు మహిళ సమావేశానికి పెద్దఎత్తున మహిళలు హాజరైనా కేవలం రెండుమూడు నిముషాలు మాత్రమే మాట్లాడి ప్రసంగం ముగించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపైన టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలో తన విద్యా జీవితాన్ని వివరించారు.టెన్త్ వరకు వీక్ స్టూడెంట్‌గా ఉన్న తాను తండ్రి చంద్రబాబు పట్టించుకోవడంతో ఎలా అమెరికా చదువులు చదివి పెద్దవాడైందీ గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేసి యువత నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉద్యోగావకాశాలు పెరగడానికి దోహదం చేస్తానని హామీ ఇచ్చారు.అంతకుముందు గుడుపల్లె రాళ్ల గంగమాంబ ఆలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ గుడుపల్లె సింగిల్‌విండోలో మొత్తం 13 సీట్లు గెలిపించినందుకు స్థానిక నాయకులను అభినందించారు. తన తండ్రి చంద్రబాబు ఇందుకోసమే, గుడుపల్లె తన గుండెకాయ అని తరచూ చెబుతుంటారని గుర్తు చేసుకున్నారు.తెలుగుయువత నియోజకవర్గ కన్వీనర్ సత్యేంద్రశేఖర్ ఆధ్వర్యంలో లోకేష్ రోడ్‌షో ఘనంగా జరిగింది.కుప్పం, గుడుపల్లె ర్యటన సందర్భంగా పరామర్శలు, ప్రసంగాలు, గ్రామ పర్యటనలు, విద్యార్థుల పలకరింపులు..

ఇలా అన్నింటిలో లోకేష్ వ్యవహార శైలి ఆయన తండ్రి చంద్రబాబును తలపించడం విశేషం. ఎంపీ శివప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జంగాలపల్లె శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, స్థానిక నాయకులు పి.ఎస్.మునిరత్నం, విద్యాసాగర్, సత్యేంద్రశేఖర్, గోపీనాథ్, నాను, బీసీ.నాగరాజ్, వెంకటేష్, సాంబశివం, నాను, భాగ్యరాజ్, రాజ్‌కుమార్, ఎమ్మార్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.