March 9, 2013

కాంగ్రెస్,వైసీపీ నేతలు ముఖాలతో ప్రజల్లోకెళతారు?

సూళ్లూరుపేట : రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పెరిగిపోయాయి. వస్తువుల ధరలు చుక్కల్లోకి వెళ్లిపోయాయి. స్వీచ్ వేస్తే కరెంట్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారు. ఇందుకు కారకులు ఎవరు?.. ఆరేళ్ల అవినీతి పాలన చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏడాది పాలించిన రోశయ్య, రెండేళ్లుగా సీఎం పదవి వెలగబెడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డిలు కారా...? ఇంత దరిద్రంగా పాలనచేసి రాష్ట్రాన్ని దిగజార్చిన ఈ నేతల పేర్లు చెప్పుకుంటూ కాంగ్రెస్, వైసీపీ నేతలు ఏ ముఖాలు పెట్టుకుని ప్రజల్లోకి వెళతారయ్యా... అంటూ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం సాయంత్రం సూళ్లూరుపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వైసీపీ నేతలూ.. మీ నేత చరిత్ర చెప్పగలరా!

ఓడరేవు, గనులు, ఒక్కటేమిటి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాన్ని దోచిపారేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర ఆపార్టీ నేతలు ప్రజలకు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. చేసిన పాపం ఊరికే పొదన్నట్లు జగన్ జైల్లో మగ్గుతుంటే వీరికి సహకరించిన పలువురు ఐఏఎస్ అధికారులు, పలు పారిశ్రామికవేత్తలు జైలుపాలు కావాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు రాబోయే రోజుల్లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారన్నారు.

కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగగలరా..

ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుత పరిస్థితులను బట్టి అంధరాష్ట్రమంటే సరిపోతుందన్నారు. ఈ ఘనత కాంగ్రెస్‌పార్టీ వల్లే వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఒక్క పారి శ్రామిక వేత్త కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేకున్నారని చెప్పారు. 2 లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారని, 1200 పరిశ్రమలు అప్పులు కట్టలేక బ్యాంకుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నేత చంద్రబాబే

రాష్ట్రం దిగజారిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్న ఈ తరుణంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తాకలిగిన నాయకుడు రాష్ట్రంలో ఒక్క చంద్రబాబే అన్నారు. ఇది తన అభిప్రాయం కాదని.. ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించారన్నారు. రాబోయేది ఎన్నికల కాలం ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.