March 9, 2013

మీ రొస్తే నేను వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే


మీరందరు వస్తే ఇక నేనుండను. వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే..' - రాజకీయాల్లో చేరతామంటూ విద్యార్థు లు చూపిన ఉత్సాహానికి నారా లోకేష్ భయం నటిస్తూ అన్న మాటలివి. గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ ఆలయ ఆవరణలో శుక్రవారం ఆయన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 'డాక్టర్లు ఎవరవుతారు? ఇంజినీర్లు కావాలని ఎవరికి కోరిక ఉంది? పోలీసులు కాబోయేవారెవరు?' అని ప్రశ్నిస్తూ చేతులెత్తాల్సిం దిగా చిన్నారులను కోరారు. ప్రతి ప్రశ్నకు ఎంతో కొంతమంది చేతులెత్తి తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. 'అయితే రాజకీయ నాయకులు ఎవరవుతారు?' అన్న ప్రశ్నకు మాత్రం 9వ తరగతి చదివే సందీప్ అనే విద్యార్థి ఒక్కరే చేతులెత్తాడు.

'నువొక్కడే రాజకీయ నాయకుడు అవుతావురా' అంటూ ఆ చిన్నారిని పలకరించిన లోకేష్ నేడు రాజకీయాల్లో అవినీతి, అసమర్థత తప్ప మరేమి లేదన్నారు. సమర్థమైన నాయకుడు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. పై చదువులు చదివి రాజకీయ విధానాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు తేవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే వుందన్నారు. 'ఇప్పుడు చెప్పండి ఎవరు రాజకీయ నాయకులవుతార'ని మళ్లీ ప్రశ్నించారు. దీంతో అక్కడున్న విద్యార్థులందరూ 'మేము అవుతా మం'టూ చేతులెత్తారు. దీంతో ఖంగు తిన్నట్లు అభినయించిన లోకేష్ 'అందరు రాజకీయాల్లోకొస్తే ఇక నేనుండను. నేను మళ్లీ వేరే ఉద్యోగం వెతుకోవాల్సిందే అని హాస్యస్ఫోరకంగా వ్యాఖ్యా నించారు.