March 9, 2013

కొల్లేరుపై నాడే వైఎస్‌ని కడిగేశాను!

తిన్నదంతా కక్కిస్తా
ప్రాజెక్టుల్లో తెగ మేసేశారు..
కృష్ణాజిల్లాలో ముగిసిన బాబు యాత్ర..
ఉప్పుటేరు వద్ద పశ్చిమలోకి 'మీకోసం..'

  "కొల్లేరులో బాంబులు పెట్టి చెరువులను ధ్వంసంచేసే హక్కు మీకు ఎవరిచ్చారని అప్పట్లోనే వైఎస్‌ని అసెంబ్లీలో నిలదీశాను. ఇక్కడ కాదు..కొల్లేరు ప్రజల ముందు తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరాను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కొందరు అడ్డగోలుగా దోచుకున్నారని, వాళ్లు తిన్నదంతా కక్కిస్తానని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పేరిట అప్పటి వైఎస్ ప్రభుత్వం వేల కోట్లు మేసేసిందని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా కైకలూరు మండలం ఆలపాడు వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రానికి ఉప్పుటేరు వంతెన పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు.

ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఆలపాడు, ఉప్పుటూరుల్లో, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ కొల్లేరు ప్రజలను రాజశేఖరరెడ్డి అన్నివిధాలా వంచించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే కాంటూరును 'ఫ్లస్ త్రీ'కి కుదించి అక్రమంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల చెరువులను పేదలకు పంచుతానని హామీ ఇచ్చారు. "కొల్లేరులో చెరువులను బాంబులతో ధ్వంసం చేసి..ఆ పాపాన్ని రాజశేఖరరెడ్డి మాకు అంటకట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో ప్రజలు కూడా దాన్ని నమ్మారు. కొన్నాళ్ళకు (2006) వాస్తవాలు వెల్లడయ్యాయ''ని గుర్తుచేశారు. దాళ్వాకు నీరు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మొండి కేస్తుందని, డెల్టా ఆధునికీకరణ పేరిట రూ.4,600 కోట్ల నిధులు నీటి పాలు చేసి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.

కృష్ణాలో ముగిసిన యాత్ర: కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద చంద్రబాబు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణాజిల్లా రెండు విడతలుగా చంద్రబాబు పర్యటించారు. మొదటి విడతలో ఆరు నియోజకవర్గాలు, ఏడు మండలాలు, 83 గ్రామాలను.. రెండో విడతలో 4 నియోజకవర్గాలు, 8 మండలాలు, 60 గ్రామాల్లో యాత్ర చేశారు.