February 14, 2013

ఉప్పలపాడునుంచి.. కొలకటూరు

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర బుధవారం ఉదయం 10.45లకు ఉప్పలపాడు గ్రామం నుండి బయలుదేరింది. చంద్రబాబు బస్సు దిగగానే ఉప్పలపాడు గ్రామ మహిళలు హారతులు ఇచ్చారు. గ్రామంలో ఎన్నారైల తల్లిదండ్రులు చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. చంద్రబాబు మంగళవారం రాత్రికి ఉప్పలపాడు చేరుకున్నా, అక్కడ బహిరంగ సమావేశంలో మాట్లాడలేదు. చంద్రబాబు 2000 కి.మీ. పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పలపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 40 కేజీల కేక్‌ను చంద్రబాబు కట్ చేసి గ్రామస్తులకు తినిపించారు.

అనంతరం 2000 బెలూన్లను, రెండు పావురాలను ఆకాశంలోకి ఎగురవేశారు. అనంతరం ఉప్పలపాడు సెంటర్‌లో బహిరంగ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం చేశారు. ఉప్పలపాడు పక్షుల సంరక్షణా కేంద్రాన్ని పర్యాటక స్థలంగా తీర్చుదిద్దుతామని అన్నారు. పాదయాత్ర గ్రామం చివరివరకూ గ్రామస్తులు బంతిపూల బాటను అలంకరించినట్లు ఉంది. గ్రామ శివారులో రోడ్డుకిరువైపుల వున్న గుడిసెలలోకి చంద్రబాబు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు నుంచి వెంకటకృష్ణాపురానికి కనకతప్పెట్ల నడుమ ముందుకు సాగింది. దారి పొడవునా వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, బస్సులు బారులు తీరాయి. మార్గ మధ్యంలో చంద్రబాబు ఓ లారీ ఎక్కి ్రడైవర్‌తో సంభాషించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి నుంచి గుంటూరుకు వస్తున్న ఆర్టిసీ బస్సులోకి ఎక్కారు. బస్సులోని మహిళా కండక్టర్‌తో చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు కండక్టర్ ఉద్యోగాలు ఇప్పించింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. బస్సులోని ప్రయాణికులకు అభివాదం తెలుపుతూ సమస్యలు తెలుసుకొని కిందకి దిగారు. గడ్డి ట్రాక్టర్ పైకి ఎక్కి రైతులతో మాట్లాడారు. అలా కార్యకర్తల ఉత్సాహాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జొన్న చేలోకి వెళ్లి అక్కడ గడ్డిమోపును తలపై పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మినుము పైరును పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పాదయాత్ర వెంకట కృష్ణాపురంకు చేరుకుంది. అక్కడ చంద్రబాబు 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సాంబశివరావు 2000 మొక్కలను పంపిణీ చేశారు. సిద్ధార్ధ కాన్సెప్ట్ స్కూల్ పిల్లలందరూ చంద్రబాబును చూసేందుకు, మాట్లాడేందుకు రోడ్డుపైకి వచ్చారు. దీంతో చంద్రబాబు పిల్లలతో పాఠశాలలోకి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకొని తగిన సూచనలను ఇచ్చారు. 2.20లకు భోజన విరామం ప్రకటించారు. విరామ సమయంలో చంద్రబాబు మెదక్ జిల్లా నుండి వచ్చిన సహకార సంఘాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన మాజీ మంత్రి బాబూమోహన్ సందడి చేశారు. పర్చూరు నుండి ఏలూరు సాంబశివరావు 1200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీతో చంద్రబాబు యాత్రకు సంఘీభావాన్ని తెలియజేశారు. పాదయాత్ర హాఫ్ పేట ఎస్సీకాలనీకి సాయంత్రం 5.45 నిమిషాలకు చేరుకుంది. అక్కడ చంద్రబాబు పేదవారిని ఉద్ధేశించి ప్రసంగించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హాఫ్ పేట గ్రామసెంటర్‌కు చేరి అక్కడి ప్రజలనుద్ధేశించి బహిరంగ సమావేశంలో మాట్లాడారు.

చలపతి విద్యాసంస్థల విరాళం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు సంస్థల తరుపున పార్టీకి రూ. 5.20లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వైవి ఆంజనేయులు మాట్లాడుతూ 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలపతి విద్యా సంస్థల్ని ప్రారంభించారని వెల్లడించారు. 17 సంవత్సరాల నుంచి విజయవంతంగా విద్యా సంస్థల్ని నిర్వహించడం హర్షణీయమని, దేశ భవిష్యత్తు మార్చే విద్యార్థుల్ని తయారు చేయాలని ఈ సందర్భంగా వైవి ఆంజనేయులుకు ఉద్భోదించారు. కార్యక్రమంలో చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నాదెండ్ల రామారావు, సంయుక్త క్యాదర్శి సుబ్బారావు, కళాశాల విద్యార్థులు అవినాష్, ఈశ్వర్‌టోనీ, శ్రీనివాసరెడ్డి, రమ్య, యోగ్యశ్రీ,వర్షిని పాల్గొన్నారు.