February 14, 2013

పులిచింతల మేము పూర్తి చేస్తాం

డెల్టా ప్రజల సాగునీటి కష్టాలు తీర్చేందుకు నాడు పులిచింతల ప్రాజెక్టుకు తాము శంకుస్థాపన చేశాం. రెండేళ్లలో పూర్తి చేసేవాళ్లం. కాంగ్రెస్ పార్టీ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. గుంటూరు చానల్‌కు మరమ్మతులు నిర్వహించడం లేదు. మరోవైపు ఆధునికీకరణ చేపట్టడం లేదు. అసలు ఈ ప్రభుత్వానికి సాగునీటి యాజమాన్యం తెలియదు. 'సాగర్'లో 497 అడుగుల నీటిమట్టం ఉన్నా పంటలకు పూర్తిస్థాయిలో నీరిచ్చిన చరిత్ర టీడీపీది. నేడు 517 అడుగుల నీటిమట్టం ఉన్నా పంటలకు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గంలోని ఉప్పలపాడు నుంచి ఏడో రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు వెంకటకృష్ణాపురం, జాకీర్‌హుస్సేన్‌నగర్, హాఫ్‌పేట మీదుగా కొలకలూరు వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో రైతుల తన దృష్టికి తీసుకొచ్చిన సాగునీటి సమస్యపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తన హయాంలో సాగునీటి తీరువా వసూళ్లను సంఘాలకే అప్పగించానన్నారు. ప్రాజెక్టు, డ్రిస్టిబ్యూటరీ, నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసి వారు చెల్లించిన డబ్బులు వాళ్లకే ఇస్తే ఎంతోబాగా కాలువల మరమ్మతులు పనులు చేసుకొన్నారని చెప్పారు. ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలని చెప్పి రూ. 500 కోట్లు విడుదల చేశారని, వాటిని దొంగ బిల్లులతో కాంగ్రెస్ దొంగలు నొక్కేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క పని జరగదన్నారు. గుంటూరు చానల్ కాలువ పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు దానికి రిపేర్లు, ఆధునికీకరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. తాను అధికారంలోకి రాగానే చానల్‌ను ఆధునికీకరణ చేసి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.

విజయవాడ, గుంటూరు, తెనాలిని

కలిపేసి మెగాసిటీ


చంద్రబాబు గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా మారుస్తానని చేస్తోన్న హామీలో తాజాగా తెనాలి పట్టణాన్ని కూడా చేర్చారు. ఈ మూడింటిని కలిపి హైదరాబాద్ కంటే ఒక మహానగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. దీని వలన ఒక మెగా టౌన్‌షిప్ వస్తుందని, భూముల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయన్నారు. ఆ భూములను కాంగ్రెస్ దొంగలు లాక్కొన్నట్లుగా కాకుండా రైతులే విక్రయించుకొనే అవకాశం కల్పిస్తానని చెప్పారు. అలానే ఐటీ హబ్, రింగురోడ్లు, వ్యవసాయాదారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రం నెలకొల్పి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామి ఇచ్చారు.

ఉప్పలపాడును

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా


ఉప్పలపాడుకు విదేశీ పక్షులు వస్తాయి. తెలుగుదేశం పార్టీనే అక్కడ పక్షి కేంద్రం నెలకొల్పింది. దానిని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తాను. దాంతో పర్యాటకం పెరిగి ఈ ప్రాంతం విశేషంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఉప్పలపాడు గ్రామం ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. రానున్న ఎన్నికల్లోనూ ఏకపక్షంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయం దండగని అనలేదు

ఆ రోజున రైతుబిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి పైకి రావాలని నేను అంటే, వ్యవసాయం దండగ అని అన్నానని వైఎస్ ద్రుష్పచారం చేశాడని, అది మీరు కూడా నమ్మి ఓట్లేశారని చెప్పారు. వైఎస్ అరచేతిలో స్వర్గం చూపించాడు. ఆయన చేసింది కేవలం రెండు రూపాయల కేజీ బియ్యం పథకం. అది కూడా తమిళనాడులో ఉచితంగా ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో ఊరికి ఒకరికే ఆపరేషన్ చేసి కార్పొరేట్ ఆస్పత్రులకు దోచి పెట్టాడు. ప్రభుత్వాసుపత్రుల్లో అసలు వైద్యం మానేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. పేద వాడి ఆరోగ్యం కోసం సమగ్ర బీమా పథకం తీసుకొచ్చి అందులో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి అన్ని వ్యాధులను చేర్చి చికిత్స చేయిస్తానన్నారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, కందుకూరి వీరయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.