February 14, 2013

అడుగడుగునా జన నీరాజనం

వస్తున్నా మీ కోసం పాదయా త్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటించిన తెలుగుదేశం అధినేత చం ద్రబాబు నాయుడుకి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. సాయం త్రం 5 గంటలు నియోజక వర్గంలో ప్రవేశించిన బాబు పాదయాత్రకు లభించిన జనాదరణతో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఐదు గంటల పాటు ఏకధాటిగా జరిగిన పాదయా త్రలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు ఓర్పుగా వింటూ ప్రజలంతా అనందంగా గడిపే మన ప్రభుత్వం రానుందంటూ ఊరట కల్పించారు. పలు చోట్ల చంద్రబాబు కు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. విద్యార్థులు, యువత బాబు ఆటో గ్రాఫ్ కోసం పోటీపడ్డారు. చిన్నారులను ఆప్యాయంగా ముద్దాడుతూ, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కోసం దారి పొడవునా జనం ఎదురుతెన్నులు చూశారు.

కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇంతటి పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని, కిరణ్‌ను కిరికిరి ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ ఆయన ఏ పని చేయలేడని దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోని ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు దాచుకునేందుకే కాం గ్రెస్ పార్టీ తల్లి, పిల్ల కాంగ్రెస్‌గా విడిపోయిందని విమర్శించారు. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లారు తప్ప త్యాగాలు చేయలేదన్న సంగతి ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజాధనం దోచుకుంటే శిక్షలు పడాలా..లేదా ప్రజలే ఆలోచించాలన్నారు. లేదని కనికరం చూపిస్తే భావితరాలకు భవిష్యత్ ఉండదని సూచించారు.

ఈ వయసులో ఈ కష్టం మీ కోసమే


కాళ్లు నెప్పులు పుడుతున్నాయి..మొరాయిస్తున్నాయి..63 ఏళ్ల వయస్సులో పడుతున్న ఈ కష్టం ప్రజల కోసమేనంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించానని, ప్రతిపక్ష నేతగా ఉన్నానని ప్రజల కష్టాలు చూడలేక పాద యాత్ర చేపట్టానని చెప్పారు. భగవంతుడు శక్తి ఇచ్చినంత కాలం పాదయా త్ర కొనసాగుతుందని, ఇప్పటి వరకు 2000 కి.మీ సాగిన పాదయాత్ర మరెవరూ చేయలేకపోయారన్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ .. ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతా .. నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఆలోచించండి..అందరితో చర్చించండి..ఇప్పటికైనా నన్ను నమ్మకపోతే బాధపడను.. నచ్చితే నిండు మనసుతో ఆశీర్వదించండి అంటూ చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.

ఫోన్‌కు రాని నీళ్లు

ఎస్ఎంఎస్‌కు మాత్రం మద్యం


రా ష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ చేసినా మంచినీరు దొరకదని, ఎస్ఎంఎస్ చేస్తే మాత్రం ఫుల్‌గా మద్యం అందుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మద్యం ఫుల్..నీళ్లు నిల్ అన్న పరిస్థితులు రా ష్ట్రంలో నెలకొన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు.

ఏడాది ఓపిక పట్టండి

రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, పేదలు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఏడాది ఓపిక పడితే ఈ కష్టాలన్నీ గట్టెక్కిస్తానని చం ద్రబాబు భరోసా ఇచ్చారు. బాలికా సంరక్షణకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.

రెండోపంటకు నీరివ్వాల్సిందే

అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కునారిల్లుతున్న రైతనన్నను ఆదుకునేందుకు రెండో పంటకు నీరివ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. డెల్టాలో మొక్కజొన్నకు నీరందక ఎండిపోతున్న వైనాన్ని తెలుసుకున్న ఆయన రైతులకు నీరు ఇప్పించే వరకు పోరాడతామన్నారు. వెంటనే గవర్నర్‌కు లేఖ పంపుతామని, అవసరమైతే రాస్తారోకోలు చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కృష్ణా డెల్టాకు రెండో పంటకి నీళ్లిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆ దిశగా కాం గ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఆధునికీకరణలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు.