February 14, 2013

అడుగడుగున 'నారా'జనాలు

చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. బుధవారం ఉప్పలపాడు నుంచి వెంకట కృష్ణాపురం వరకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర జనసంద్రంగా మారింది. నందివెలుగు రోడ్డులో ఇసుక వేస్తే రాలనంతగా జనం చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉప్పలపాడు బహిరంగ సభలో చంద్రబాబు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు చంద్రబాబు సావదానంగా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఓ మహిళ అనటంతో చంద్రబాబు చిరు నవ్వుతో ఆమెతో ముచ్చటించారు.

గత ఎన్నికల్లో ప్రజలు చేసిన తప్పుకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోమారు తాము అధికారంలోకి వస్తామని తప్పక ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు. ఆయా గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యం వాటికే ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పలు చోట్ల మహిళలు హారతులు పట్టారు. చంద్రబాబు పాదయాత్రలో ఆద్యంతం మహిళలు ముందుండి నడిపించారు. అనేక చోట్ల మహిళలు చంద్రబాబుతో ముచ్చటించి తమ సమస్యలు విన్నవించారు. మహిళల సంక్షేమానికి టీడీపీ పెద్ద పీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వెలినేని శ్రీనివాసరావు (బాబు), మాజీ సర్పంచ్‌లు పెద్ది అప్పాజి, భూషబాబు, దేశం నాయకులు పెద్ది సాంబశివరావు, చెన్నుపాటి సాంబశివరావు పాల్గొన్నారు.