February 14, 2013

భద్రతపై టీడీపీ ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై గుంటూరు జిల్లా పోలీసుల వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉన్నా వారు పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కాన్వాయ్‌లోకి ్రపైవేటు వాహనాలు చొరబడుతున్నా వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. అలాగే ఆయన ప్రసంగించే చోట బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీ చేయించడమే తప్ప వేదికల పటిష్ఠతను సరిచూడాలన్న నిబంధనను గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు.

అలాగే ప్రైవేటు వ్యక్తులను నిరోధించాల్సిందీ వారేనన్నారు. ఈ నిబంధనలను పోలీసులు పాటించకపోవడమే గురువారం కొలకలూరులో మెట్లు కూలడానికి కారణమని ఆరోపించారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి 50 మందికి మించి పోలీసులను నియమించలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా నగరం దాటిన తర్వాత పర్యవేక్షణ కొరవడిందన్నారు.

కాగా, చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు మోహన్ కొలకలూరులో వేదికను ఉదయమే పరిశీలించారు. అది కనిపిస్తున్నంత పటిష్ఠంగా లేదని ఆయన గ్రహించారు. దీంతో చంద్రబాబు కిందినుంచే ప్రసంగిస్తారని చెప్పారు. అయితే టీడీపీ స్థానిక నేత కొలకలూరు నాగేశ్వరరావు "చంద్రబాబు గారూ రండి... బంగారు నాన్నా... పైకి రండి'' అంటూ మైకులో ఆహ్వానించారు. ఆయన అభిమానాన్ని కాదనలేని చంద్రబాబు, ఒకవైపు మోహన్ సంజ్ఞలతో వారిస్తున్నా మెట్లెక్కారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా మెట్లు బలహీనంగా ఉన్నట్లు ఆయనకు చెప్పకపోవడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తమ అధినేతకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.