February 14, 2013

మీ సువర్ణ పాలన మళ్లీ రావాలి


సార్... మాకు ఉదయం పూట కరెంటు కావాలి. రాత్రి వేళ ఇచ్చే మూడు గంటల విద్యుత్ వద్దు. దాని వలన మేము పొలాల్లో నిద్ర పోవాల్సి వస్తోంది. అన్నా ఈ సారి ప్రభుత్వం మీదే. మీ సువర్ణపాలన మళ్లీ రావాలి. మన ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. మన ప్రభుత్వాన్ని తెచ్చుకొంటే వాళ్లు మనకు అనుకూలంగా పని చేస్తారంటూ కొలకలూరు రథం సెంటర్‌లో పలువురు మహిళలు చంద్రబాబుతో సంభాషించారు. దుగ్గిరాల నుంచి వచ్చిన మరో మహిళ తమకు కాఫీ ఫ్యాక్టరీ వలన మురుగునీరు ఊళ్లోకి వచ్చి భరించలేకున్నామని చెప్పారు. దాని పని పట్టాలన్నారు. మరో మహిళ టీడీపీకి రూ. 10 వేల విరాళాన్ని అందజేశారు.

చంద్రబాబు స్పందిస్తూ 'నేను కొలకలూరును నా జీవితంలో మరిచిపోలేను. రాత్రి ఇక్కడే బస చేశాను. మీరు నిండు మనస్సులతో దీవిస్తూ మంచి రోజులు రావాలని ఆశ్వీరదించారు. చెల్లెమ్మా... మీలో కూడా లోపం ఉంది... కాంగ్రెస్ వాళ్లు మోసం, నమ్మకద్రోహం చేస్తారని ఆలోచించకుండా రెండుసార్లు గెలిపించారు. ఉచిత విద్యుత్ అని చెప్పి వైఎస్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని చెప్పారు. అతను డబ్బులు లేకుండా ఏ పని చేయడని, విద్యుత్ ప్రాజెక్టులన్ని తన వాళ్లకు కట్టబెట్టి దోచుకొన్నాడని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ను నమ్ముకొంటే మీరు ఉండే ఇంటి కప్పు కూడా మిగల్చరన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయా? పావలా వడ్డీ కలగా మిగిలిపోయింది. మీ కష్టాలు తీరాలంటే మీలో చైతన్యం తీసుకురావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నేను పాదయాత్ర చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.