February 14, 2013

చంద్రబాబు నాయుడుకు తృటిలో తప్పిన ప్రమాదం

విగ్రహావిష్కరణ సభలో కూలిన వేదిక మెట్లు
బాబు క్రింద పడకుండా పట్టుకున్న భద్రతా సిబ్బంది
వైద్య పరీక్షలు నిర్వహించిన వ్యక్తిగత వైద్యులు
యాత్రకు తాత్కాలిక విరామం : డాక్టర్ల సూచన

  'వస్తున్నా..మీకోసం' పర్యటనలో భాగంగా గురువారం గుంటూరు జిల్లాలోని కొలకలూరులో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగ్‌జ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ చేసి కిందకు దిగుతుండగా ఒక్కసారిగా వేదిక మెట్లు కూలిపోయాయి. దీంతో ఆయన కిందపడబోయారు. అప్రమత్తమైన సహాయ సిబ్బంది సమయస్ఫూర్తితో చంద్రబాబును పట్టుకున్నారు. ఈ ఘటనలో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు.

చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వైద్యలు ఆయనకు గాయాలు అయ్యాయేమోనని పరీక్షలు నిర్వహించారు. గాయాలు కాలేదని, పాద యాత్ర నిర్వహించాలని బాబు నిర్ణయించారు. అయితే ఈ పూట పాదయాత్రకు విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. కుడికాలి మడమ దగ్గర నొప్పి రావడంతో ఆర్థోపెడిక్ డాక్టర్లను పిలిపించారు. ఇదివరకే ఎడమకాలు చిటికెన వేలుకు గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు గాయాలైనట్లు తెలియవచ్చింది. రాజాకు కుడికాలు మడమ మెలిపడినట్లు తెలుస్తున్నది. ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కాగా పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబుకు ఇది రెండో ప్రమాదం. మొదటిది మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో స్టేజి కూలింది. రెండోది గురువారం గుంటూరు జిల్లా కొలకలూరిలో స్టేజి మెట్లు కూలిపోయాయి. దీంతో బాబు రెండు గండాలు తప్పించుకున్నట్టు అయ్యింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన సతీమణి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి బాబుకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. అలాగే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పార్టీ నేతలు కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.

అంతకుముందు గురువారం ఉదయం జిల్లాలోని కొలకలూరు నుంచి 136వ రోజు పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 72 గంటల్లో ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోతే సోమవారం రైతులతో మహాధర్నా చేపట్టనున్నట్టు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. హెలికాఫ్టర్ల కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమేనని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేటు ఆస్పత్రులకే లబ్ది చేకూరుతుందని చంద్రబాబు విమర్శించారు.