February 14, 2013

చంద్రబాబుకు మహిళల నీరాజనం

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గురువారం కొలకలూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబుకు మహిళలు అడుగడుగునా నీరాజనం పలికారు. బాబుకు ఎదురేగి హారతులిచ్చి, నుదుట కుంకుమ దిద్ది స్వాగతించారు. తెలుగు మహిళల అభిమానం, ఆప్యాయతలతో ఆయన నూతనోత్సాహంతో ముందుకు సాగారు. మా బంగారు చెల్లెమ్మలు, మా బంగారు అక్కయ్యలు అని సంబోధిస్తూ యాత్రను కొనసాగించారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. వృద్ధులను ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ తల్లిపాము..వైఎస్సార్ కాంగ్రెస్ పిల్లపాము

కాంగ్రెస్ తల్లిపామైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పిల్లపాము వంటిదని .. పిల్లపాముకు ఎక్కువ విషం ఉంటుందని కాటేస్తే కోలుకోలేరని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారని,ఈ సారి జా గ్రత్త వహించక పోతే శాశ్వతంగా ఇబ్బందులు పడతారాన్నరు. కొందరు నేతలు నేరుగా చెంచల్‌గూడా జైలుకు వెళ్లి అక్కడ కొబ్బరికాయలు కొట్టి మరీ వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని, ప్రజలు ఏమనుకుంటారో అన్ని సిగ్గు కూడా వీరికి లేదన్నారు. పేదరికం ఎక్కడుంటే తెలుగుదేశం అక్కడే ఉంటుందని, ఎన్నికల రోజున నన్ను గుర్తుంచుకోండి.. ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిలా ఉంటానని హామీ ఇచ్చారు.

కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్

పూర్వం భోఫోర్స్ కుంభకోణంతో దేశంలో అవినీతి విలయతాండవం చేస్తే కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలకు మారుపేరుగా నిలిచిందని చం ద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశరక్షణకు ముఖ్యనేతల ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ల కొనుగోలులో కోట్లాది రూపాయలు దోచుకోవడం సిగ్గుచేటన్నారు. కుంభకోణాలతో దేశ సంవదను దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగలను ఏం చేయాలన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కాంగ్రెస్ నాయకులు డబ్బు సంపాదన కోసం విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు.

రామయ్యకు పరామర్శ

కొలకలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముత్తే రామయ్యను చం ద్రబాబు పరామర్శించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామయ్యను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా మందులు వాడాలని, దిగులు పడవద్దని సూచించారు. పార్టీ తరపున రూ.25వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. పాదయాత్రలో చం ద్రబాబుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రులు కోడెల శివ ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జెఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ యడ్ల గంగాధరరావు, తెనాలి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్, తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు నాగభైరవ రత్నబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.