February 14, 2013

సాగునీటిపై టీడీసీ సమరశంఖం

సాగునీటి సమస్యపై తెలుగుదేశం పార్టీ సమరశంఖం పూరించింది. సాగర్, డెల్టా ఆయకట్టుల్లో పంటలను కాపాడేందుకు తక్షణం నీటి విడుదల చేయాలని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం వరకు ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షించి అప్పటికీ నీరు విడుదల చేయకపోతే సోమవారం మహాధర్నాకు దిగనున్నట్లు హెచ్చరించారు.

కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం సక్రమంగా సాగునీటిని విడుదల చేయలేదు. వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన వరద నీటినే విడుదల చేసింది. దాని వలన పంటకు నీరు అవసరమైన సమయంలో నీళ్లు లేక, అవసరం లేనప్పుడు నీళ్లు వచ్చి సమస్యలు తలెత్తాయి.

దాంతో ఖరీఫ్‌లో ఇంచుమించు 30 శాతం పైగా రైతులు వరి పంట వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రబీలోనైనా నష్టాన్ని పూడ్చుకొనేందుకు మొక్కజొన్న, పెసలు వంటి ఆరుతడి పంటలు వేశారు. అయితే జనవరి నుంచి నీటిని నిలిపేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు సాగర్ ఆయకట్టుకు ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వలేదు. రబీలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే రైతులకు సరిపడా ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో మిర్చికి నీరు అవసరం. అయితే జిల్లా యంత్రాంగం సాగునీరు ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో రైతులు చంద్రబాబుకు పాదయాత్రలో నివేదించడంతో ఆయన టీడీపీ జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వానికి మూడు రోజుల గడువు విధించారు. అప్పటిలోపు సీఎం స్పందించి నీళ్లు విడుదల చేయకపోతే సోమవారం ఉదయం తాను పాదయాత్రలో ఎక్కడ ఉంటే అక్కడ మహాధర్నా చేపట్టాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించారు.