February 14, 2013

కడప పౌరుషాన్ని కాంగ్రెస్ కాళ్ల ముందు పెట్టిన వైసీపీ

జగన్ పత్రిక.. విష పుత్రిక
తప్పుడు రాతలతో హృదయాలను గాయపరుస్తోంది
సహకార ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కు
జగన్ బెయిల్ కోసం యత్నాల్లో భాగమే
బాబుపై రౌడీషీట్ తెరవాలనడం వారి అవివేకం
కోండ్రు మురళి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు
ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

  పనిగట్టుకుని తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. సాక్షి స్వతంత్ర మీడియానా? జగన్ మీడియానో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరో ఆకతాయిలు ఆ పత్రిక కార్యాలయంపై రాయివేస్తే టీడీపీ వాళ్ళు వేశారని అల్లరి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వాస్తవం కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోకపోయినా.. జగన్ పత్రిక తప్పుడు రాతలతో ఎన్నో హృదయాలను గాయపరుస్తోందని దుయ్యబట్టారు.

కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విలేకరులతో మాట్లాడారు. కడప పౌరుషం.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలపై పోరాటం అంటూ జబ్బలు చరుచుకున్న వైసీపీ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ కాళ్ల ముందు మోకరిల్లిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లకు అంతిమ యాత్ర వంటిదన్నారు. కోండ్రు మురళి పిచ్చికుక్కలాగా తమ అధినేత చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆయన మరోమారు నోరు తెరిస్తే టీడీపీ కార్యకర్తలు చూస్తూ కూర్చోరని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. వైఎస్ దత్త పుత్రుడిగా పేరొందిన కోండ్రు మురళికి అనేక కుంభకోణాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, వీటిని త్వరలోనే టీడీపీ బయట పెడుతుందని చెప్పారు.

జగన్‌పై కేసులు ఎత్తి వేయించుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోందని, కనీసం బెయిల్ అయినా దక్కించుకునేందుకు సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ కుమ్మక్కవుతోందని విమర్శించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టలేని వైకాపా దద్దమ్మలు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 30 మంది సహకార అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జర్నలిస్టు నాయకుడిగా చెప్పుకొంటున్న అమర్, జగన్‌కు ఏజెంటులా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ఆయన వెంటనే జర్నలిస్ట్ యూనియన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జగన్ అక్రమాస్తులన్నింటినీ తవ్వి తీసి స్వాధీనం చేసుకుంటామని, ఆ సొమ్మును రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.

వారి మానసిక స్థాయి ప్రజలకు తెలుసు: రేవంత్ రెడ్డి

గుంటూరులో జగన్ పత్రిక కార్యాలయంపై రాళ్లు పడినందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 'గుంటూరులో చంద్రబాబు పాదయాత్రపై సాక్షి కార్యాలయం నుంచి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దాంతో ఆగ్రహం చెందిన వారెవరో వాటినే తిరిగి ఆ కార్యాలయంపై విసిరి ఉంటారు. సాక్షి పత్రిక పెట్టిన నాటి నుంచి అందులో నాలుగు పేజీలు కేవలం చంద్రబాబుపై తిట్లకు, దూషణలకు కేటాయించి రాస్తున్నారు. ఆయన కుటుంబంపై కూడా నీచాతినీచంగా రాశారు.

అయినా మేం ఏనాడూ సాక్షిపై దాడులకు దిగలేదు. అలా దిగాల్సి వస్తే ఇప్పటికే వందలు, వేల దాడులు జరిగేవి. మేం మా వాదన వినిపించడం, ఖండనలు ఇవ్వడం తప్ప దాడుల జోలికి పోలేద'ని రేవంత్ అన్నారు. 35 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలన్న వారి మానసిక స్థాయిని ప్రజలు అర్థం చేసుకోగలరని, చంద్రబాబుపై మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు వంటి వారికి ఏ విషయంలో నైపుణ్యం ఉందో ఇప్పటికే ప్రసార సాధనాల ద్వారా ప్రజలంతా తెలుసుకొన్నారని, ఆయనను పార్టీ గవర్నింగ్ కౌన్సిల్‌లో పెట్టిన జగన్ స్థాయి కూడా తెలిసిపోతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.

'జగన్ మీడియా విషయంలో ఏదైనా జరిగితే... అది మాత్రమే పత్రికా స్వేచ్ఛపై దాడి అన్నట్లు, ప్రజాస్వామ్యం కనుమరుగవుతున్నట్లు జగన్ పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఇదే పార్టీ నేతలు 'ఆంధ్రజ్యోతి'పై దాడులు చే సినప్పుడు పత్రికా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? ఈ రోజు చెబుతున్న సుద్దులు ఆ రోజు వినిపించలేదేం?' అని ఆయన ప్రశ్నించారు.