February 14, 2013

చంద్రబాబు కుడికాలి మడమపై ఒత్తిడి

బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
కొలకలూరులో కుప్పకూలిన వేదిక మెట్లు


గుంటూరు జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబుకు గురువారం కొలకలూరులో పెనుముప్పు త్రుటిలో తప్పింది. వేదికపై ప్రసంగించి.. కిందకు దిగుతుండగా మెట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ, పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను పట్టుకోవడంతో.. కింద పడకుండా ఆగారు. కానీ, ఆ సమయంలో శరీరం బరువు మొత్తం కుడికాలి మీదే పడటంతో.. కుడికాలి మడమ బెణికి, నడక కష్టంగా మారింది.

వైద్యుల సూచన మేరకు పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో తన ఎనిమిదో రోజు పాదయాత్రను గురువారం ఉదయం తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు నుంచి ప్రారంభించారు. కొలకలూరు మెయిన్‌రోడ్డు సెంటర్‌లో అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ నాయకుడు నాగేశ్వరరావు సభా వేదిక ఏర్పాటుచేశారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత కిందకు దిగుతుండగా సెంట్రింగ్‌తో ఏర్పాటుచేసిన సభావేదిక మెట్లు కుప్పకూలాయి. దాంతో ఆయన కాలు బెణికింది. తర్వాత కూడా.. అక్కడినుంచి అర కిలోమీటరు దూరం నడిచిన చంద్రబాబు.. నొప్పి భరించలేక కుర్చీలో కూర్చుండిపోయారు. ఫిజియోథెరపిస్టు వచ్చి కాలి మడమను పరిశీలించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అనంతరం మరికొందరు వైద్యులు పరిశీలించి.. కొంత వాపు వచ్చిందని, పాదయాత్ర కొనసాగించడం మంచిది కాదని చెప్పి గురువారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా గాయపడ్డారు. గురువారం సాయంత్రానికి అంగలకుదురు గ్రామానికి పాదయాత్ర చేరుకోవాల్సి ఉండగా కొలకలూరు శివార్లలోనే నిలిపేశారు. చంద్రబాబు అతి కష్టమ్మీద ఫిజియోథెరపిస్టు సాయంతో ఫర్లాంగు దూరం నడిచి.. వ్యాన్‌లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్‌చేసి పరామర్శించారు.

నాడు గద్వాలలో...
చంద్రబాబు పాదయాత్రలో ఇలా వేదిక కూలడం ఇది రెండోసారి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో చంద్రబాబు ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన కిందపడిపోయారు.

బాబుకు శరద్‌యాదవ్ ఫోన్
హైదరాబాద్: చంద్రబాబుకు ఎన్డీయే నేత శరద్‌యాదవ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

నేటి నుంచి యాత్ర యథాతథం
పాదయాత్రను శుక్రవారం నుంచి యథాతథంగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.