February 14, 2013

పాదచారికి తప్పిన ప్రమాదం

పాదచారికి పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు మరో కష్టం వచ్చి పడింది. ఎడమకాలి చిటికెన వేలు, నడుం నొప్పి, బీపీ, షుగర్‌లు ఇప్పటికే బాధిస్తుండగా.. స్టేజ్ మెట్లు కూలిన దుర్ఘటనతో మరో బాధ(కుడికాలి మడమ) వచ్చి చేరింది. అయినాసరే.. అలుపెరగని ఆ బాటసారి తాను పాదయాత్ర కొనసాగించి తీరుతానని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు.

తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరులో వేదికపై ప్రసంగించి దిగుతుండగా మెట్లు కుప్పకూలిపోవడంతో ఆయన ముప్పును తప్పించుకోగలిగారు కాని కొత్తగా కుడికాలికి మడమ నొప్పి బాధ తలెత్తడంతో భరించలేక పాదయాత్రకు స్వల్ప విరామం తీసుకొన్నారు. అయినా పాదయాత్రను కొనసాగించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

కొలకలూరు నుంచి గురువారం ఉదయం జిల్లాలో ఎనిమిదో రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. కొలకలూరు గ్రామంలో మహిళల హారతులు, దీవెనలు అందుకొంటూ వారి సమస్యలు తెలుసుకొంటూ వాటిపై స్పందిస్తూ నడిచారు. పార్టీ సీనియర్ నాయకుడు మత్తే రామయ్య ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలా ఆదుకొంటుందని భరోసా ఇచ్చి రూ. 25 వేల ఆర్థికసాయం చేశారు. అనంతరం రథం సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉన్న మెయిన్ రోడ్డు కూడలికి చేరుకొన్నారు. అంతకు 10 నిమిషాల ముందే చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడం, మహిళలతో సమస్యలపై సంభాషించడంతో మెయిన్ రోడ్డు సెంటర్ వద్ద ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లిపోతారని అంతా భావించారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు కొలకలూరి నాగేశ్వరరావు, ఆయన సతీమణి వసంత సభా వేదిక ఏర్పాటు చేశారు. అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ విగ్రహాలు ఉన్న కూడలి కావడం, నాగేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో ఆయన విజ్ఞాపనను కాదనలేకపోయారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి ్రపైవేటు వేదికలపై చంద్రబాబు ఎక్కకుండా జాగ్రత్త తీసుకొన్నారు. కొలకలూరులో మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞాపనను తిరస్కరించలేక వేదికపైకి చేరుకొని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ చేసిన త్యాగాలను వివరించారు. సాగునీరు, స్థానిక సమస్యలపై స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం రావాలంటూ ప్రజలకు సూచించారు.

చంద్రబాబు ప్రసంగం పూర్తి కావడంతో అప్పటివరకు వేదిక మెట్లపై కూర్చున్న పార్టీ జిల్లా నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నక్కా ఆనందబాబు, జేఆర్ పుష్పరాజ్ తదితరులు కిందికి దిగారు. చంద్రబాబు మెట్ల పైకి చేరుకోగానే ఒక్కసారిగా సెంట్రింగ్ చెక్కలతో నిర్మించిన స్టేజ్ మెట్లు కుప్పకూలిపోయాయి. ఏమి జరుగుతుందో గ్రహించేలోపే చంద్రబాబు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని పట్టుకొన్నారు. సంఘటనలో చంద్రబాబు పక్కనే ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పక్కటెముకలు ఒరుసుకుపోయాయి. దాంతో ఆయన తీవ్ర నొప్పికి గురయ్యారు. ఇదే సంఘటనలో నాగేశ్వరరావు, ఆయన సతీమణి వసంత కూడా స్టేజ్ మీద నుంచి కింద పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి.

చంద్రబాబు కుడికాలి మడమపై శరీరం బరువంతా పడటంతో ఆయన బాధకు గురయ్యారు. ఫిజియోథెరపిస్టు సూచన మేరకు ఆయన అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరం నడిచాక నొప్పి పెరగడంతో చంద్రబాబు రోడ్డు పక్కనే కుర్చీలో కూర్చుండిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖంలో నొప్పి బాధిస్తుండటం స్పష్టంగా కనిపించింది. ఆయన కళ్లు మూసుకొని నొప్పిని భరిస్తూ తనకేమి కాలేదని, పాదయాత్ర సాయంత్రం కొనసాగిస్తానని చెప్పారు. ఆ తర్వాత గుంటూరు, తెనాలి నుంచి వచ్చిన వైద్యుల బృందం పరిశీలించిన అనంతరం గురువారం వరకు పూర్తి విశ్రాంతి అవసరమని చంద్రబాబుకు చెప్పారు. అందుకు చంద్రబాబు అంగీకరించి కష్టం మీద మరో ఫర్లాంగు దూరం నడిచి విశ్రాంతి రథంలోకి వెళ్లిపోయారు.

ఉత్కంఠ..

జిల్లా నేతల పరామర్శ


చంద్రబాబు కుడికాలి మడమ నొప్పితో విశ్రాంతి తీసుకొంటున్నారన్న సమాచారంతో జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. పాదయాత్రకు రెండు, నుంచి నాలుగు రోజుల పాటు విరామం ఉండవచ్చని కాసేపు, ఎన్నికల కోడ్ ముగిసేవరకు నిలిపేయవచ్చని మరికాసేపు నాయకులు, కార్యకర్తలు చర్చించుకొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం దాటిన తర్వాత పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహన్‌రావు, టీడీపీ జిల్లా నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గరికపాటి ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు గురువారం విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతస్థాయి వైద్య బృందం పరిశీలించిన తర్వాత శుక్రవారం ఉదయం పాదయాత్ర కొనసాగింపు ప్రకటన చేస్తామన్నారు. చంద్రబాబు మాత్రం తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారని వెల్లడించారు. కాసేపటికి విశ్రాంతి రథం నుంచి చంద్రబాబు బయటకు రావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.