September 5, 2013

భవిష్యత్‌లో కాంగ్రెస్ భూస్తాపితం : చంద్రబాబు

30 ఏళ్లుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, భవిష్యత్‌లో కాంగ్రెస్‌ను భూస్తాపితం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా మోతడకలో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో బాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత నిర్ణయంలా తీసుకుందని మండిపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీఆర్ఎస్ విలీనం కోసం రాష్ట్రంలో మరో సమస్యను సృష్టించిందని బాబు మండిపడ్డారు. ఈ విషయంపై ఒకసారి యువత ఆలోచించాలని కోరారు.

టీఆర్ఎస్, వైసీపీ పార్టీలను విలీనం చేసుకుని మెజార్టీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ గురించి మాట్లాడేవారు హైదరాబాద్‌కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక ్తం చేశారు. ఇటలీ, ఇడుపుల పాయకు మైత్రి కుదరడంతోనే తెలుగుజాతికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల సీమాంధ్ర, తెలంగాణలో అనేక మంది చనిపోయారన్నారు. దీనికి కాంగ్రెస్సే కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు.

తెలుగు జాతి తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని బాబు అన్నారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మలా మారార ని, లక్షల కోట్లు అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, ప్రస్తుత పరిస్థితులపై విద్యార్థులకు ఆవేశం రావాలని, అవినీతిపై మాట్లాడకుండా కూర్చోవడం సరికాదన్నారు. అభివృద్ధిలో తనను నితీష్, మోడి ఫాలో అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.