September 5, 2013

కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే సోనియా గాంధీకి డబ్బు పిచ్చి ఆత్మగౌరవ యాత్రలో బాబు

యూరప్‌లో ఇటలీ మాఫియా. మనకు పులివెందుల ఎలాగో అక్కడ ఇటలీ అలాంటిది. అక్కడి నుంచి వచ్చిన సోనియాకు డబ్బు పిచ్చ. మన దేశంలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టేస్తోంది. నాడు వైఎస్ వారానికి రూ. వంద కోట్లు ఆమెకు కప్పం కట్టి వచ్చేవాడు. ఆమె కుమారుడు మొద్దబాయి రాహుల్‌ను దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. ఇంకోపక్క విజయలక్ష్మి తనయుడు జగన్‌ను సీఎం చేయాలి. అందుకోసం ఇటలీ, ఇడుపులపాయతో లంకె కుదుర్చుకొన్నారు. మంచి వారైన తెలుగుజాతి పిల్లల పొట్ట కొడుతున్నారు. కాంగ్రెస్ ఒక దారుణమైన, భయానకమైన నిర్ణయం తీసుకోవడం వలనే ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి హక్కుల కోసం పోరాడుతున్నారు. మిమ్మల్ని రోడ్డెక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఇక శంకరగిరి మాన్యాలే గతి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి బుధవారం చంద్రబాబు నాల్గో రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించి అమరావతి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరం పైగా యాత్ర చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతోన్న చిదంబరం, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాంనబి అజాద్‌లపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీలుగా గెలవలేని వీళ్లు తెలుగుజాతిపై పెత్తనం చేస్తామంటూ చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు. చిదంబరం గత ఎన్నికల్లో ఫలితాన్ని తారుమారు చేసి ఎంపీ అయ్యారు. దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాంనబీ అజాద్ ఎన్నికల్లో గెలవలేరన్నారు. వీళ్లా మన భవిష్యత్తు నిర్ణయించేది. ఒక్కసారి ఆలోచన చేసి తిరగబడాలని పిలుపునిచ్చారు. సోనియాపై చంద్రబాబు మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఇటలీలో పుట్టిన ఆమె ఈ దేశాన్ని సర్వనాశనం చేసేస్తోంది. ఆర్థిక వ్యవస్థను పతనం చేసి కుక్కల చింపిన విస్తరిలా మార్చేసింది. అవినీతిని విచ్చలవిడిగా పెంచి పోషిస్తోంది. ఇంకోపక్క ఢిల్లీలో ఎలా తిరుగుతారో చూస్తానని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ బెదిరిస్తున్నాడు. ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ మీ ఆటలు సాగనివ్వనని చంద్రబాబు హెచ్చరించారు.

మతం, కులాన్ని చూడొద్దు

ఉల్లిపాయలు బజారులో కేజీ రూ. 80 ధర పలుకుతున్నాయి. ఒక కులానికి ఒక రేటు, మరో కులానికి ఇంకో ధరకు విక్రయించరు కదా. అందరికి సమాన ధరకే అమ్ముతారు. ఇదే విధంగా రాజకీయాల్లో మతం, కులాలను చూసి ఓటేయవద్దని చంద్రబాబు హితవు పలికారు. ఎవరైతే మంచి చేస్తారో, ధర్మం పక్షాన నిలుస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.

మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతాం
మాట తప్పం... మడమ తిప్పని వంశం తమదని అన్న వైఎస్ కుటుంబ సభ్యులు నేడు మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతున్నారు. మాట ఎప్పుడుపడితే అప్పుడు మారుస్తున్నారు. తోక జాడించడం, మాయలఫకీరుల్లా మాట్లాడటం వాళ్ల నినాదంగా మారింది. వాళ్లని నమ్మి మోసపోవద్దని చంద్రబాబు అన్నారు.

లోక్‌సభలో ప్రధాని సమాధానం గర్హనీయం

బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయమైన ఉదంతంపై ప్రధాని మన్మోహన్ లోక్‌సభలో ఇచ్చిన సమాధానం గర్హనీయం. ఆయనకు ఎంతమాత్రం వ్యక్తిత్వం లేదు. పనికిమాలిన అసమర్థుడు. తన కింద ఉన్న శాఖలో ఫైళ్లు మాయమైతే ఆయనకు దేశాన్ని పరిపాలించే అర్హతే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశాన్ని పరిపాలించడం చేతకాని మీరు తక్షణం దిగి వెళ్లిపోండి. ఎన్నికలు వస్తాయి. ప్రజల ఓట్లతో టీడీపీ గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పి దేశాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టిస్తుందన్నారు.

హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు నావే
హైదరాబాద్‌ను నేను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాను. తొమ్మిదేళ్లలోనే సింగపూర్ కంటే మెరుగ్గా అభివృద్ధిపరిచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాను. అమెరికాకు వెళ్లినప్పుడు ఈ ప్రధానమంత్రే మాకు కూడా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఉందని చెప్పారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేస్తున్నారు. నేడు ఎవరైనా ఇక్కడి నుంచి విదేశాలకు వెళితే వారు జగన్ మనుషులేమోనని భయపడిపోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు తన ఒక్కడికే ఉన్నాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మీకు నాపై, తెలుగుదేశం పార్టీపై కక్ష ఉంటే తీర్చుకోండి. అంతే కానీ తెలుగుజాతి విచ్ఛిన్నం కోసం కుట్ర పన్నితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

వరకట్నం లేకుండా సామాజిక మార్పు తీసుకొచ్చాం

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేలా చేశాను. నేడు వాళ్లు ఇంజనీర్లు, డాక్టర్లు అయి ఏడాదికి రూ. కోటికి పైగా సంపాదిస్తున్నారు. దాంతో వరకట్నం లేకుండానే పెళ్లి చేసుకొనే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ సామాజిక మార్పు తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. బుద్ధుడు నడియాడిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అమరావతిలో చంద్రబాబు యాత్రకు విశేష స్పందన లభించింది. చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులున్నారు.