September 5, 2013

కాంగ్రెస్, వైసిపీలకు సెగపెడుతున్న బాబు

కాంగ్రెస్, వైసిపీలకు బాబు సెగపెడుతున్నాడు. ఆత్మగౌరవ యాత్రలో ఆయన పేలుస్తున్న మాటల తూటాలు ఆ రెండుపార్టీలకు సూటిగా తగులుతున్నాయి. ప్రజల హృదయాల్లోకి నేరుగా చొచ్చుకుపోతున్నాయి. తాను చేసిన అభివృద్ది, వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అవినీతి, ధరలు వంటి వాటిని ప్రస్తావిస్తూ చంద్రబాబు దూసుకుపోతున్న తీరు టిడిపిలో కూడా ఆత్మస్తైర్యాన్ని పెంచుతోంది. మచ్చుకు కొన్ని ఆయన మాటలు పరిశీలిస్తే....

రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోను.. అలా చేస్తే కాంగ్రెస్ కు మిగిలేది శంకరగిరి మాన్యాలే .. తెలుగుజాతిని ఇంత నీచంగా చూస్తారా, చూస్తే మీరు ఊరుకుంటారా.. మీకు నేను అండగా ఉంటా ... ఇలా మాట్లాడుతూ ప్రజలతోను సై అనిపించుకుంటూ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఫైళ్లనే రక్షించలేని ప్రధాని 120 కోట్ల ప్రజలను ఏం కాపాడుతాడనడం, ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా నా మనల్ని విడగొట్టేది అంటూ నిప్పులు చెరగడం ప్రజలపై గట్టి ముద్రే వేస్తోంది.

తమ్ముళ్లూ.. నాకు రెండుసార్లు అధికారం ఇచ్చారు, తరువాత, వైఎస్ కు అధికారం ఇస్తే ఏమయింది అన్నింటి ధరలు పెరిగాయి, ప్రజాదనం ఆయన కొడుకే అడ్డంగా దోచుకున్నాడు, దేశంలో ఏమయింది కాంగ్రెస్ హయాంలో దోపిడీలు, అరాచకాలు పెరిగాయి. ఉల్లినుంచి అన్నింటి ధరలు నా హయాంలో ఎంత ఉండేవి, ఇప్పుడెంత ఉన్నాయంటూ దరల పట్టీ ఏకరువు పెట్టారు చంద్రబాబు. హైదరాబాద్, సికింద్రాబాద్ అని రెండే ఉండేవని తాను సైబరాబాద్ ను ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ది చేసానని చెప్పారు. ఇలా కాంగ్రెస్ ను, వైసీపిని ఎండగడుతూ, ఎన్టీఆర్ సెంటిమెంటును ఉపయోగిస్తూ ఆయన ముందుకు సాగుతున్న వైనం ప్రత్యర్థుల్లో దడపుట్టిస్తోంది. ఈ తరహా ప్రసంగాలు బాబు ఆత్మగౌరవ యాత్ర ముందు ఎవరూ ఊహించేలేదు. బాబు కేవలం సీమాంద్రను విడగొట్టడం వల్ల వచ్చే సమస్యలను మాత్రమే ఏకరవుపెడతారని అనుకున్నారంతా. కానీ ఆయన తన బాణాలన్నీ పార్టీలపై ఎక్కుపెట్టడంతో, తాము కూడా అదే దోవలో వెళ్లాలా? లేక సీమాంధ్ర సమస్యలపైనే మాట్లాడాలా అన్నది అర్థం కాక కాంగ్రెస్, వైకాపాలు డీలా పడుతున్నాయి. అయితే ఇక్కడ ఓ టిస్టు వుంది. రాష్ట్రం విడిపోయి, భవిష్యత్ అంధకారం అయిపోతున్న తరుణంలో, ఏం చేయాలన్నది ప్రజలకు దిశా నిర్దేశం చేయక, ఎన్నికల సభల్లో మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారు అనేవారు లేకపోలేదు. ఏమయినా బాబు పుట్టించిన కాక ఇంతా అంతా కాదు. అది వాస్తవం.