September 5, 2013

తెలుగుజాతిపై పెత్తనం చేస్తే ఊరుకోం కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే

స్వాతంత్య్రం రావాలంటే కాంగ్రెస్‌ను సాగనంపాలి
ఇటలీకి ఇడుపుల పాయకు లంకె
ఎంపీలుగా గెలవలేని వాళ్లా మన భవిష్యత్తు తేల్చేది
తెలుగుజాతిపై పెత్తనం చేస్తే ఊరుకోం
కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు నిప్పులు


 
'దేశానికి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదు. నేటికీ విదేశీయుల పాలనలోనే కొనసాగుతోంది. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ రావాలంటే విదేశీయుల నాయకత్వంలో నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీని సాగనంపాల'ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి బుధవారం చంద్రబాబు నాలుగో రోజు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమై అమరావతి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్లకుపైగా సాగింది. పలు ప్రాంతాల్లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బొగ్గు కుంభకోణం ఫైళ్లను మసి చేసినట్లే కాంగ్రెస్‌ను మసి చేయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

'ఇటలీకి చెందిన సోనియా దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది. ఇక్కడి డబ్బంతా విదేశాలకు తరలిస్తోంది. రూపాయి పతనానికి కారకురాలైంది. తెలుగుజాతి మధ్యన చిచ్చు పెట్టింది. సమస్యలు పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. బుద్ధి ఉన్న వారెవ్వరూ ఆ పని చేయరు. దొంగబ్బాయి జగన్‌కు నాలుగు రోజుల ముందే సమాచారమిచ్చి వారి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఏమిటీ ఈ నీచమైన రాజకీయాలు. మీరంతా కలిసి ఆమె గూబ గుయ్‌మనిపించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


'మనకు పులివెందుల ఎలాగో యూరప్‌లో ఇటలీ అలాంటిది. అక్కడి నుంచి వచ్చిన సోనియాకు డబ్బు పిచ్చి. మన దేశంలోని డబ్బంతా కొల్లగొట్టేస్తోంది. నాడు వైఎస్ వారానికి వంద కోట్లు ఆమెకు కప్పం కట్టి వచ్చేవాడు. ఆమె కుమారుడు మొద్దబాయి రాహుల్‌ను దేశానికి ప్రధానిని చేయాలి. ఇంకోపక్క విజయలక్ష్మి తనయుడు జగన్‌ను సీఎం చేయాలి. అందుకోసం ఇటలీ, ఇడుపులపాయతో లంకె కుదుర్చుకున్నారు. మంచి వారైన తెలుగుజాతి పిల్లల పొట్ట కొడుతున్నారు. కాంగ్రెస్ దారుణమైన, భయానకమైన నిర్ణయం తీసుకున్నందు వల్లే ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి హక్కుల కోసం పోరాడుతున్నారు.

మిమ్మల్ని రోడ్డెక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఇక శంకరగిరి మాన్యాలే గతి' అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతోన్న చిదంబరం, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాం నబీ అజాద్‌లపై ఆయన ధ్వజమెత్తారు. ఎంపీలుగా గెలవలేని వీళ్లు తెలుగుజాతిపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో మతం, కులాలను చూసి ఓటేయవద్దని చంద్రబాబు హితవు పలికారు. ఎవరైతే మంచి చేస్తారో, ధర్మం పక్షాన నిలుస్తారో వారినే ఆదరించాలన్నారు.

'మాట తప్పని.. మడమ తిప్పని వంశం తమదన్న వైఎస్ కుటుంబ సభ్యులు నేడు మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతున్నారు. మాట ఎప్పుడు పడితే అప్పుడు మార్చుతున్నారు. తోక జాడించడం, మాయల ఫకీరుల్లా మాట్లాడటం వాళ్ల నినాదంగా మారింది. వాళ్లని నమ్మి మోసపోవద్ద'ని చంద్రబాబు అన్నారు. ప్రధానికి వ్యక్తిత్వం లేదని, అసమర్థుడని మండిపడ్డారు. తాను నిర్వహించే శాఖలోనే ఫైళ్లు మాయమయ్యాయంటే ఆయనకు దేశాన్ని పాలించే అర్హతే లేదని చంద్రబాబు అన్నారు.


'హైదరాబాద్‌ను నేను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాను. తొమ్మిదేళ్లలోనే సింగపూర్ కంటే మెరుగ్గా అభివృద్ధిపరిచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాను. అమెరికాకు వెళ్లినప్పుడు ఈ ప్రధానే మాకు కూడా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఉందని చెప్పారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేస్తున్నారు. నేడు ఎవరైనా ఇక్కడి నుంచి విదేశాలకు వెళితే వాళ్లు జగన్ మనుషులేమోనని భయపడిపోతున్నారు.

హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు నా ఒక్కడికే ఉన్నాయి' అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తనపై, తెలుగుదేశం పార్టీపై కక్ష ఉంటే తీర్చుకోవాలని, అంతే కానీ తెలుగుజాతి విచ్ఛిన్నం కోసం కుట్ర పన్నితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాత్రలో ఆయన వెంట టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులున్నారు.


రాహుల్‌గాంధీని మొద్దబ్బాయి, జగన్‌ను దొంగబ్బాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అమరావతిలో ప్రజలు బాగా స్పందించారు. వారిద్దరూ ప్రధాని, సీఎం అయితే ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయని బాబు అన్నారు. దొంగబ్బాయికి మీరు ఓట్లేస్తారా? మొద్దబ్బాయికి సహకరిస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందన్న వ్యాఖ్యలకూ ప్రజలు విశేషంగా స్పందించారు. 'విజయలక్ష్మి నంగి నంగి మాట్లాడుతున్నారు. మాలో ఎన్‌టీఆర్ పౌరుషం, స్ఫూర్తి ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు' అని చంద్రబాబు హెచ్చరించారు.