September 5, 2013

తిట్లు తిట్టడానికేనా మీ నోళ్ళు!: ఎర్రబెల్లి

తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నరోజు దానిని మెచ్చుకోవడానికి ముందుకు రాని జెఎసి, టిఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం ప్రశ్నించింది. 'తెలుగుదేశం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడిన పార్టీ. అలాంటి పార్టీ తన తెలంగాణ ప్రజల కోసం తన విధానాన్ని మార్చుకొని ఏ పార్టీ చేయనంత త్యాగం చేసింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంది.

జెఎసి నేతలు, టిఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కసారైనా నోరు తెరిచి చంద్రబాబును మెచ్చుకొన్నారా? లేఖ ఇమ్మంటే ఇచ్చాం. మహానాడులో తీర్మానం చేయమంటే చేశాం. అఖిలపక్షంలో చెప్పమంటే చెప్పాం. వాటిలో వేటినైనా కనీసం స్వాగతించారా? స్వాగతించకపోగా కెసిఆర్ అఖిలపక్షం అయిన మర్నాడు మాకు వ్యతిరేకంగా బంద్ పిలుపు ఇచ్చారు.

దానికి జెఎసి మద్దతు. మిగిలిన అన్ని పార్టీలు టిడిపి తెలంగాణ కోసం లేఖ ఇచ్చిందని చెప్పినా కెసిఆర్ వినలేదు. మేం మద్దతే ఇవ్వలేదనేవాళ్ళకు ఇప్పుడు మేం మాట మార్చానో... యు టర్న్ తిరిగామనో అనే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఢిల్లీ వెళ్తానంటే తిడతారు. వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని తిడతారు. తిట్లు తిట్టడానికేనా మీ నోళ్ళు! అందులో నుంచి ఒక్క మంచి మాట రాదా' అని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విస్మయం వ్యక్తం చేశారు.