September 2, 2013

చంద్రబాబుకు ఘనస్వాగతం

ఆత్మగౌరవ యాత్రలో భాగంగా మండలంలోని ధూళిపాళ్ళకు విచ్చేసిన చంద్రబాబుతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకకోసం సాయంత్రం 6గంటల నుంచి ధూళిపాళ్ళ గ్రామస్తులు ప్రధాన రహదారిపై అధికసంఖ్యలో చేరి చంద్రబాబుపై పూలవర్షం కురిపించారు. ప్రజలనుద్దేశించి కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. అనంతరం భాగ్యనగర్‌కాలనీ, వెన్నాదేవి, వావిలాలనగర్ వద్ద కూడా పార్టీశ్రేణులు, గ్రామస్తులు అధికసంఖ్యలో రోడ్డుపై చేరి చంద్రబాబు కాన్వాయికి అడ్డుపడి కొద్దిసేపు మాట్లాడాలని కోరారు. అనంతరం శాతవాహన స్పిన్నింగ్ మిల్లు కార్మికులు
వావిలాలనగర్ వద్ద చంద్రబాబును కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ 2014లో టిడిపి అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. అనంతరం యాత్ర పాకాలపాడు మీదుగా రెంటపాళ్ళ చేరుకుంది. రెంటపాళ్ళలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్ విగ్రహాలను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. రాత్రి బస రెంటపాళ్ళలో జరిగింది. యాత్రలో మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.