September 2, 2013

అవి సోనియాకు 2 చెప్పులు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తున్న ప్రధాని




  తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర లో సోమవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండోరోజునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పలుచోట్ల సభల్లో ఆయన కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో పొత్తుపెట్టుకొని గెలవాలని సోనియాగాంధీ భావిస్తున్నారని.. ఆ రెండు పార్టీలనూ ఆమె రెండు చెప్పులుగా వాడుకునేందు కు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. "ఇదెంతో దుర్మార్గపు ఆలోచన. ఇటువం టి కాంగ్రెస్ దొంగలను ఉరితీయాలి. ర్రాష్టాన్ని కాపాడుకోవాలి'' అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా రావని భావించే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని, తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని నిప్పులు చెరిగారు. ప్రధాని మన్మోహన్ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "ఆడపిల్లలు బయటకు వెళితే తిరిగిరాలేని దుస్థితి ఏర్పడింది. అలాంటి కేసులో మూడేళ్లు జైలు శిక్ష విధించారు. ఏడాదిన్నరగా జగన్ జైల్లో ఉన్నాడు. అయినా ఏమీ మారలేదు. అలాంటి దుర్మార్గులకు మరణశిక్ష వేయాలి... అప్పుడే మిగతావారు భయంతో తప్పు చేయకుండా ఉంటారు'' అని "ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేవు.. అవినీతిని అరికట్టలేవు.. ధరలను తగ్గించలేవు.. ఫైళ్లను కాపాడుకోలేవు.. నీకెందుకయ్యా ప్రధాని పదవి.. సోనియాకు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తూ ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేస్తూ వ్యక్తిత్వం లేకుండా వ్యవహరిస్తున్నావ్'' అంటూ మన్మోహన్‌పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో, కేంద్రంలోనూ పాలించే అవకాశాన్ని ప్రజలు కాంగ్రెస్‌కు కల్పించినా ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా సోనియాగాంధీకి పెంపుడు కుక్క ల్లా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముద్దపప్పు రాహుల్‌ను ప్రధాని చేసే తపనతోనే తెలుగుజాతి మధ్య సోనియా చిచ్చు పెట్టిందని, ఆ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కుట్ర ఇప్పటిదికాదని, 1999లోనే ప్రారంభమైందని ధ్వజమెత్తారు. దీన్ని తమ నాయకుడు వైఎస్ఆర్ ప్రారంభించారని సోనియా గాంధీ ముగించారని దిగ్విజయ్ సింగే వ్యాఖ్యానించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఉద్యమాలు జరిగాయా, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమయ్యాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మొదటి ఐదేళ్లు దోపిడీ, చివరి ఐదేళ్లు అనిశ్చిత పరిస్థితితో ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మీకు చేత కాక పోతే నాకు వదిలి పెట్టి రాజీనామాలు చేసి వెళ్లిపోండి. ఏడాదిలోపు ర్రాష్టాన్ని బాగు చేస్తా''నంటూ సవాల్ విసిరారు.
"మాట తప్పను.. మడమ తిప్పను'' అనే నినాదంతో జనం మధ్యకు వచ్చిన జగన్ నేడు బెయిల్ కోసం మాట తప్పి, మడమ తిప్పి సోనియా గాంధీ కాళ్లు పట్టుకొనే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని, సోనియా ఆదేశాలను జైలులో ఉన్న జగన్ తూచా తప్ప కుండా పాటిస్తున్నారంటూ ఆరోపించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి నాలుగు రోజులు ముందుగానే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. "సీడబ్ల్యూసీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నదీ కలగన్నారా?'' అంటూ ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం తెలుగు జాతి పొట్ట కొట్టేందుకు ప్రయత్నించటం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు యాత్ర గుంటూరు జిల్లా నెమలిపురి దాటి నకరికల్లు వెళుతున్నప్పుడు వైసీపీ నేతలు కొందరు కవ్వింపులకు పాల్పడ్డారు. ఆయన రాకను గమనించి వైఎస్ విగ్రహానికి పాలుపోసి నినాదాలు చేశారు. మైక్ చేతబట్టి, తెలంగాణపై వైఖరి చెప్పాలని నిలదీశారు. పోలీసులకు ఈ విష యం ముందుగానే తెలిసినా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. కేవలం వారికి అడ్డుగా మూడు జీపులుపెట్టి చంద్రబాబు కాన్వాయ్‌కి ఆటంకం కలగకుండా చూశారు.
  చంద్రబాబు యాత్రలో ఊరువాడా రోడ్లపైకి వచ్చి జేజేలు పలుకుతున్నారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. అడుగడుగునా వాహనానికి అడ్డుపడుతూ ప్రసంగించాలని పట్టుబడుతున్నారు. మండుటెండలోనూ గంటలతరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ బర్తరఫ్ చేస్తే ప్రజలు ఏడాది తిరగకుండా ఎలా అధికారంలోకి తెచ్చి బుద్ధి చెప్పారో సోనియాకూ అదేగతి పట్టిస్తారన్న హెచ్చరికలకు విశేష స్పందన వస్తోంది