June 24, 2013

బాధితులకు బాబు ఓదార్పు

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రానికి చెందిన యాత్రికులు పడుతున్న నరక యాతనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చలించి పోయారు. హైదరాబాద్‌ నుండి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్‌ రాథోడ్‌లతో కలిసి డెహరాడూన్‌లో పర్యటించిన బాబు అక్కడి పరిస్థితులను యాత్రికులను అడిగి తెలుసు కున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసి తెలుగువారిని ఆదుకుని ఆంధ్రప్రదేశ్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్తించారు. అటు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు షిండే, ప్రభృతులకూ చంద్రబాబు నాయుడు సోమవారం నాడు లేఖలు రాశారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సైన్యం హెలీకాఫ్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌కు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించిన చంద్రబాబు వారిని స్వంత జిల్లాలకు తరలించేందుకు నేతలను పురమాయించారు. కేసినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, కాజీపేట ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మరంగా పన్నాహాలు చేశారు. అటు ఎన్టీఆర్‌ట్రస్ట్‌ కూడ ఉత్తరాఖండ్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ రెండు ెహెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. బాధితులు ఎక్కడి నుండి ఫోన్‌ చేసినా తక్షణమే స్పందించేందుకు ఎన్టీఆర్‌ భవన్‌లోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన బాబు ఉత్తరాఖండ్‌ బాధితులను ఆదుకోవడంలో తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వం కంటే ముందే స్పందించిన తీరుపై పలువురు ప్రశంశల జల్లులు కురిపించారు.

రాష్ర్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌ వెళ్లక పోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే ప్రతిపక్ష నాయుకుడై ఉండి ప్రభుత్వంలో ఉన్న వారి కంటే ఎక్కువగా స్పందించడం పార్టీ నేతలు, కార్యకర్తల్లో స్పూర్తిని నింపుతోంది. కాగా ఉత్తరాఖండ్‌ నుండి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో విచ్చిన బాధితులకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన బాధితులను వారిని వారివారి గ్రామాలకు తరలించడానికి కేసినేని ట్రావెల్‌ వారు బస్సులను ఏర్పాటు చేశారు.