June 24, 2013

దటీజ్‌ బాబు!బాధితులకు బాసటగా బాబు


పదివేల చొప్పున ఆర్థిక సాయం
అమెరికా నుంచి వచ్చీ రాగానే ఢిల్లీకి
నేడు ఉత్తరాఖండ్‌కు...
ఏ విపత్తు వచ్చినా ముందు వెళ్లేది బాబే
ఇప్పుడూ అదే వరస
ఉత్తరాఖండ్‌కు టీడీపీ వైద్యబృందం
సమీక్షలో కిరణ్‌ బిజీ
ఫెస్టివల్‌‌సలో మునిగిన చిరంజీవి

అది ప్రకృతి విపత్తయిగాగానీ, మానవ వైఫల్యం గానీ, ప్రజలను విషాదంలో ముంచిన దుర్ఘటన గానీ.. జనం కష్టాల్లో ఉంటే అందరికంటే ముందు వారి ముంగిట వెళ్లి, భుజం తట్టి భరోసా ఇచ్చే నాయకు డన్న పేరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి చాటుకున్నారు.
కుటుంబసభ్యులతో అమెరికా వెళ్లిన చంద్రబాబునాయుడు ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి, వెంటనే ఢిల్లీకి హుటాహుటిన పయనమయ్యారు. దేశాన్ని దిగ్భ్రమపరిచిన ఉత్తరాఖండ్ విషాదంలో మన తెలుగువారు కూడా ఉండటం, ఇంకా అక్కడే సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు వారికి భరోసా ఇచ్చేందుకు అమెరికా నుంచీ వచ్చీరాగానే ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి అక్కడ బాధితులతో మాట్లాడి, భరోసా ఇచ్చారు. ఒక్కోరికి 10 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. వారికి అందుతున్న సాయంపై అధికారులను నిలదీశారు. పార్టీ తరఫున వైద్యబృందం పంపించి బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి, ఈవిధంగా చంద్రబాబునాయుడు ఇలాంటి విపత్తులు తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లి, బాధితులను ఓదార్చి, పార్టీ పక్షాన ఆర్థిక సాయం చేయడమో, వారిని ఆదుకోవడమో కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్లనుంచీ కొన సాగిస్తున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేక పోయినా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యే అల వాటు చాలాకాలం నుంచీ కొనసాగిస్తున్నారని, బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సహకరించకపోయినా అక్కడే తిష్ఠవేసి, సహాయ చర్యలను స్వయంగా సమీక్షించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో కలుషిత నీరు తాగి 12మంది చనిపోతే వైఎస్ పట్టించుకోకుండా గోవాలో జన్మ దిన వేడుకలకు హాజరయితే బాబు బాధితులకు అండగా నిలిచారు. పాద యాత్ర సందర్భంగా వరదలు వచ్చిన సందర్భంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రైతులను పరామర్శించారు.

కాగా.. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు తమ వంతు కృషిచేస్తున్నప్పటికీ, వాతావరణం అనుకూలించటంలేదు. ప్రధానంగా హెలికాప్టర్లు సరైనసంఖ్యలో లేకపోవడం కూడా నష్టంగా పరిణ మించింది. అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకం గా తీసుకుని, స్వయంగా సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి, ఆయా జిల్లాలనుంచి వెళ్లినవారి సమాచారం, క్షేమాలు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేయించారు. అయితే వీటికి సంబంధించిన ప్రచారం, సమాచారం సక్రమంగా ప్రజలకు చేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్న భావన నెలకొంది. అయితే, ఇప్పటికే 1600 మందిని రాష్ట్రా నికి పంపించిన విషయాన్ని మంత్రులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం తన విధి నిర్వహణ, బాధ్యత నిర్వర్తిం చిందని స్పష్టం చేస్తున్నారు.

అయితే, రాష్ట్రానికి సంబంధించి మొత్తం 13 మంది కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నా, వారిలో ఒక్క కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి మినహా ఎవరూ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిరంజీవి ఒక రోజు ఏపీభవన్‌కు వచ్చి హడావిడి చేసి వెళ్లారే తప్ప, పర్యాటక శాఖ మంత్రిగా అక్కడే ఉండి, వారికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అక్కడ రాష్ట్రానికి చెందిన బాధితులు సాయం కోసం ఎదురుచూస్తుంటే, ఇక్కడ చిరంజీవి ఏరువాక, బీచ్‌ఫెస్టివల్ కార్యక్రమాల్లో పాల్గొని సన్మానాలు చేయించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.