June 24, 2013

ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు ధర్నా

ఉత్తర కాశీ యాత్రకు వెళ్ళి, అక్కడ కురిసిన భారీ వర్షాలకు చిక్కుకున్న యాత్రికులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉత్తరాంఖండ్ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏపీ భవన్‌లో సహాయం పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు సరైన సహాయం అందడం లేదని పేర్కొంటూ, బాధితులతో సహా ఏపీ భవన్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. సోమవారం ఉత్తరాఖండ్ వెళ్ళనున్నారు. అక్కడ తెలుగు యాత్రికులను పరామర్శిస్తారు.

'ఇంత పెద్ద విపత్తు దేశాన్ని కుదిపేస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ప్రకతి వైపరీత్యం లేదు. కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించాలి. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలి' అని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. విపత్తు సహాయ నిధినుంచి సహాయ కార్యక్రమాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సానికి గురైన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సూచించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మందులతో సహా 20 మంది డాక్టర్ల బృందాన్ని ఉత్తరాఖండ్‌కు పంపిస్తున్నట్లు మరో టీడీపీ నేత పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తమకు హెలికాఫ్టర్ సదుపాయం కల్పిస్తే 20 మందే కాదు వంద ప్రాంతాలకకు డాక్టర్లను పంపేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
మరోవైపు కేధార్‌నాథ్, భద్రినాథ్‌లో తెలుగు యాత్రికులు ధర్నాకు దిగారు. సుమారు వెయ్యి మందికి పైగా ఆందోళన చేపట్టారు. బాధితులను హెలికాఫ్టర్‌లో ఎక్కించడంలో అధికారులు వివక్షచూపుతున్నారని, ఉత్తరాదివారికే హెలికాఫ్టర్లు ఎక్కిస్తున్నారని వారు ఆరోపించారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు డెహ్రాడూన్‌కే పరిమితమయ్యారని, ఏపీ నుంచి కూడా హెలికాఫ్టర్లు పంపించాలని తెలుగు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.