June 24, 2013

సీఎంకు నిద్ర ఎలా పడుతోంది

‘‘ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు వందల సంఖ్యలో చనిపోయారు. వేల మంది చిక్కుకున్నారు. మరి కొందరి సమాచారం తెలయడం లేదంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర ఎలా పడుతోందో తనకైతే అర్థం కావడం లేదు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయి మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.తాము కూడా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఒక నేల వేతనాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తామన్నారు.

అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నం తన నివాసంలో పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికా నుండి వచ్చిన వెంటనే తాను ఢిల్లీలోని ఏపి రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడానన్నారు. యాత్రికులను ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలించేందుకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నానన్నారు. సాయంత్రం ఢిల్లీలో ఏపీ భవన్‌లో వరద బాధితులను పరామర్శిస్తానన్నారు. సోమ, మంగళవారాల్లో తాను ఉత్తరాఖండ్‌, చార్‌ధామ్‌లో పర్యటించనున్నారు. చార్‌ధామ్‌ యాత్రకు రాష్ట్రం నుండి 12 వేల మంది వెళ్లి ఉంటారని అంచనాఅని, రాష్ట్రానికి చెందిన వారు వందల్లో గల్లంతైనట్లు సమాచారం అందుతోందని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు అధికారికంగా ఎంత మంది మృతి చెందారో తెలియడం లేదన్నారు. జాతీయ విపత్తు వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ర్ట వాసులు 5 వేల మంది చిక్కుకున్నారంటే రెవిన్యూ, రిలీఫ్‌ మంత్రి ఇక్కడి నుండి కదల్లేదని, ఉత్తరాఖండ్‌లో రక్షించిన వారిని స్వస్థలాలకు విమానాల్లో తరలించవచ్చుకదా? అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న రాష్ట్ర బాధితుల సమస్యలపై ప్రధానికి లేఖ రాశానని చంద్రబాబు నాయడు తెలిపారు.