May 28, 2013

ఎన్టీఆర్ పార్టీ పెట్టాక చైతన్య రథం పైన ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన సభలకి వస్తున్న అశేష ప్రజానీకం,


కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు, ప్రపంచం లో ఒక జాతి మొత్తాన్ని కదిలించిన బీజాక్షరాలు కూడా!
సనాతన ధర్మంలో ఓం ని ఎలా భగవంతునికి చిహ్నంగా స్వీకరించారో అలాగే తెలుగు వాడి ఆత్మ గౌరవానికి, అకుంఠిత దీక్షకి, స్థిరచిత్తానికి ఒక చిహ్నంగా కాలంతో ప్రమేయం లేకుండా ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే ఒక శక్తి NTR!
ఆయన జీవితం ఒక లోతైన సముద్రం, అలాంటి మహనీయుడి జన్మదిన సందర్భంగా ఒక జ్ఞాపకాల హారం అల్లాలి అంటే ఒక పెద్ద సాహసం అవుతందని తెలుసు. కానీ ఆయన జీవితంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మసలి, ఆయన స్పూర్తితో జీవితాన్ని గడుపుతున్న కొంత మంది గొప్ప వ్యక్తుల సహాయంతో సాధ్యం అవుతుందని అనిపించి అలాంటి వారిలో కొందరిని సంప్రదించి వారికి ఆయనతో వున్న అనుభవాల సమ్మిళితమే ఈ ఆర్టికల్.
శ్రీ మోత్కుపల్లి నరసింహులు( ఆలేరు శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు), శ్రీ మల్లెల పద్మనాభరావు(కృష్ణ జిల్లాలో ప్రఖ్యాత కుటుంబం కి చెంది షుమారుగా 60 సంవత్సరాల నుండి ప్రజా సేవలో గడుపుతున్న వ్యక్తీ, విజయవాడలో థర్మల్ స్టేషన్ నిర్మాణానికి దోహదపడిన ముఖ్య వ్యక్తి), శ్రీ వడ్డే శోభనా ద్రీశ్వర రావు ( మాజీ లోకసభ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు), Dr. యలమంచిలి శివాజీ ( మాజీ రాజ్యసభ సభ్యులు, రైతాంగ సమస్యల పైన నిరంతర పోరాట యోధులు, జాన్ దైవీ అవార్డు గ్రహీత) లతో పలుమార్లు మాట్లాడటం జరిగిన తరువాత వారి అందరి అనుభవాలని అక్షరీకరించిన ప్రయత్నమే ఇది.
పూరి గుడిసెలలో జీవితం గడుపుతూ , మెతుకు మెతుకుకీ వెతుక్కుంటూ, సమాజంలో కేవలం వోట్లు వేయటానికి మాత్రమే పనికివస్తున్న బడుగు బలహీన వర్గాల వారికి కులం, ఆర్ధిక స్తోమతతో ప్రమేయం లేకుండా పార్టీ టికెట్స్ ఇచ్చి, గెలిపించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే చెందుతుంది అని అభిప్రాయ పడిన శ్రీ నరసింహులు తను ఎన్టీఆర్ ని కలిసి పార్టీ తరుపున ఏలేరు శాసనసభ కి పోటీ చేయటానికి అవకాసం ఇమ్మని అడిగిన సందర్భంలో 'నరసింహులు గారూ, రెండు నిముషాలు ఇక్కడ వున్న వారిని ఉద్దేశించి మాట్లాడండి అనటం, అప్పుడు భావోద్వేగంతో కూడిన తన 2,3 నిమిషాల ప్రసంగం విని'ఎస్ యు ఆర్ ది కాండిడేట్ గో ఎహేడ్!' అన్నారు అని చెప్పారు. ఈ రోజుల్లో అది సాధ్యం అయ్యే పనేనా? అన్నారు . ఒక్కమాటలో చెప్పాలి అంటే అధికారం వికేంద్రీకరించి, రాజ్యాధి కారం పల్లెల్లోకి పంపి,ఒక నూత వరవడి, ఉత్తేజం సృష్టించి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. తన వివాహం అయ్యాక ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆశీర్వదించి పంపారు అని గాద్గదికమైన గొంతుతో నరసింహులు గారు చెపుతున్నప్పుడు అనిపించింది ఇన్ని దశాబ్దాలయినా ఎన్టీఆర్ స్మృతులు ఆయన ఆప్యాయత మరువలేదు అని.
చాలా మందికి ఎన్టీఆర్ కి రాజకీయానుభవం లేదు అనుకుంటారు, కానీ ఆయన మనుషుల్ని కొంచెంసేపు పరిశీలించి అన్ని వందల మందికి పార్టీ టికెట్స్ ఇచ్చి నిలబెడితే ఆ తరువాత 30 సంవత్సరాల కాలంలో చాల మంది గొప్ప నాయకులయ్యారు, ఇంత కంటే రాజకీయ చతురత ఏమి వుంటుంది? బహుశా సమాజ సేవ పట్ల కమిట్మెంట్ వున్న నాయకుడే కమిట్మెంట్ వున్న వ్యక్తులను గుర్తిస్తాడేమో !
శ్రీ వడ్డే గారి మాటల్లో చెప్పాలి అంటే చౌదరి చరణ్ సింగ్ భారత రైతాంగ సమస్యల పైన వ్రాసిన Economic Nightmare Of India అనే గొప్ప పుస్తకం లోని రైతుల సమస్యలకి పరిష్కారం చూపటానికి నిబద్దతతో ప్రయత్నం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. వ్యవసాయానికి సరైన నీటి సదుపాయం లేని తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకి చెందిన రైతాంగం, బోరు బావులు, నుయ్యి లాంటి వాటి మీద ఆధారపడి, యూనిట్ కరెంటు కి 18 పైసలు చెల్లించటం అనే ఎంతో భారమై విద్యుత్ బకాయిలు చెల్లించటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 1 H.P. మోటార్ కి కేవలం 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు అని ప్రవేశ పెట్టిన విధానం ఆయా ప్రాంతాల్లో ఒక నూతన వ్యవసాయ విప్లవాన్ని తెచ్చి వారికి ఆదాయ వనరులు పెంచింది అని చెప్పారు. గాంధి గారి ఆశయం అయ్యిన పేద వారికి కనీసావసారాలు అయిన కూడు, గుడ్డ, నీడ కల్పించాలి అన్న ఆశయంతో పక్కా ఇల్లు, 2 రూపాయలకే కిలో బియ్యం, జనత వస్త్రాలు ఇచ్చిన దేశంలోనే తోలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నరు. ఆ తరువాత ఆయన విధనాలు దేశంలో అందరు ముఖ్యమంత్రులకి మార్గ దర్సకం అయ్యాయి అన్నరు.
ఎన్టీఆర్ పార్టీ టికెట్స్ ఇవ్వటానికి ఎంచుకున్న ఏకైక సూత్రం నిజాయతి, నిబద్దత.
శ్రీ శివాజీ గారు పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టాక చైతన్య రథం పైన ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన సభలకి వస్తున్న అశేష ప్రజానీకం, వారి ఆదరణ ని కేంద్ర గూడచార సంస్థలు, కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందినా ముఖ్య నాయకుల్ని 'ఎందుకు ఎన్టీఆర్ కి ఇంత ఆదరణ లభిస్తున్నది?' అని ప్రశ్నించారు. దానికి ఆ నాయకులు చెప్పిన సమాధానం 'ఆయన పురాణ పాత్రలైన రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలతో ఎన్నో సినిమాల్లో నటించారు మేడం' . దానిపై ఆమె ఆ నాయకులకి ఒక సూచన ఇచ్చారు 'మరి ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన వేసిన పాత్రలకి ప్రతి నాయక పాత్రలు పోషించిన వారు కూడా వుంటారు కదా! వారికి కూడా విశేష ప్రజాదరణ వుంటుంది కదా! వారిని మన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వచ్చి వారితో మన పార్టీ కి అనుకూలంగా ప్రచారం చేయించండి' దానికి ఆమెకి కాంగ్రెస్ నాయకుల నుండి వచ్చిన సమాధానం 'ఆ ఆవకాశం కూడా మనకి లేదు మేడం , ఆ ప్రతినాయక పాత్రలు కూడా ఆయనే పోషించారు, ఆ రకంగా కూడా ఆయనే చెరగని ముద్ర వేసారు' అని. ఆయన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఢిల్లీ దిగ్గజాలు కూడా తికమక పడ్డాయి
కాంగ్రెస్ ని ఎదుర్కోవటానికి లోక్ నాయక్ శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ చేసిన జనతా పార్టీ ప్రయోగం అతి తక్కువ కాలంలో విఫలమయ్యాక తిరిగి నేషనల్ ఫ్రంట్ పెట్టి అన్ని రాష్ట్రాల నాయకులని ఎకత్రాటిపై నడిపించి ఢిల్లీ పీఠాధిపతులని గజ గజ లాడించిన ఏకైక ధీశాలి ఎన్టీఆర్!
స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం లభించనంతవరకూ ఎన్ని రకాలుగా మేలు చేసినా వారి జీవితం లో ఎలాంటి మార్పు ఉండదు, వారికి నిజమైన పురోభివృద్ది ఉండదు అన్న ఆలోచన తో 'స్త్రీలకి ఆస్తి లో సగభాగం ఇవ్వాలి' అన్న చట్టం తెచ్చి మొత్తం స్త్రీ జాతికే మేలు చేసింది NTR. ఎన్నో వేల ఫెమినిస్టు ఉద్యమాలు సాదించలేని ఆ అపూర్వమైన ఆర్ధిక స్వావలంభనని సాధించిపెట్టింది ఎన్టీఆర్!
'పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షన్తి స్తవిరే పుత్రాన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అని స్త్రీ ఎప్పుడైనా ఒక మగవాడి మీద ఆధారపడవాల్సిందేఅన్న మనుస్మ్రుతి రోజుల నాటి బూజు పట్టిన భావజాలాన్ని ఒక్క శాసనం తో విదిలించి నిజమైన స్వాతంత్ర్యం మహిళా లోకానికి తెచ్చి పెట్టింది NTR.
ఒక పురుషుడి దగ్గర డబ్బు వుంటే తన కొరకు, తన అలవాట్లకోరకు ఖర్చుపెడతాడు, అదే ఒక స్త్రీ దగ్గర డబ్బు వుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లితండ్రులకి లేదా కష్టాల్లో వుంటే భర్తకి, బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలనే తపనతో తన పిల్లలకి ఖర్చుపెడుతుంది. ఆ రకంగా ఒక స్త్రీ కి మేలు చేస్తే మొత్తం కుటుంబానికి చేసినట్లే,స్త్రీ లు సంతోషంగా వుంటే ఆ సమాజం అంత సంతోషంగా ఉన్నట్లే అన్న వాస్తవమే ఆయన గ్రహించి దేశంలో ఆయన కంటే ముందే పదవుల్లోవున్న మహిళా ప్రధాని, మహిళా ముఖ్యమంత్రులు చేయలేని పనిని దైర్యంగా చెసారు.
ఆయన ఈ రోజు మనతో వుండి వుంటే ఆడవారి పైన జరుగుతున్న అమానుష అత్యాచారాలను ఆపటానికి ఒక కఠినమైన చట్టం కావాలి అనే ఆవేదనతో, ఆక్రోశం తో ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేసే దుర్గతి పట్టేది కాదు ప్రజానీకానికి. నిర్భయ లాంటి చట్టాల్ని ఎప్పుడో తెచ్చేవారు. ఒక దైవం ఇచ్చిన అన్నగా మహిళా లోకానికి ఎంతో మేలు చేసిన ఆయన జన్మదినం రోజున ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళలు రాఖీ పండుగని జరుపుకోవాలి అనటం అతిశయోక్తి కాదు,
పాశ్చ్యత్త దేశాల్లో లాగ ప్రేమని ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించే అలవాటు మనకి లేదు, వుంటే ఆయన జన్మదినం మన ఆంధ్రరాష్ట్ర ప్రజానీకానికి ఫాదర్స్ డే, మదర్స్ డే లాగ, ఒక బ్రదర్స్ డే గా మారి వుండేది
అన్నా!
తెలుగువాడి ఆత్మాభిమానానికి ప్రతిరూపం మీ దివ్య తేజో రూపం! తెలుగు వాడి ఔన్నత్యానికి నిదర్శనమ్ మీ జీవితం!
మనిషిని మనిషే నమ్మని ఈ రోజుల్లో ఒక జలపాతం లాగ మీ కంఠం నుండి జాలువారిన ప్రతి మాటనీ పూర్తిగా విశ్వసించి మీ వెనుక ఒక జాతి మొత్తం ఏకమై నడిచింది
మీలాంటి నిజమైన జన హృదయ విజేత ని ఎప్పటికీ చూడలేము, మా జీవితాంతం మరవలేము!
జోహార్ ఎన్టీఆర్!