May 28, 2013

జైలు రాజాలా, అసమర్థుల, వసూళ్ళ పార్టీలను నమ్మొద్దూ !


హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ చేపట్టిన మహానాడు సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సోమవారం నుండి రెండు రోజుల పాటు జరగనుంది. మహానాడు మొదటి రోజైన సోమవారం రోజున తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఈ సందర్భంగా ముఖ్య నేతలంతా కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
 
మొదటి రోజు సభలో ప్రసంగించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అసమర్థుల పార్టీ అని, తెలంగాణా రాష్ట్ర సమితి వసూళ్ళ పార్టీ అని పేర్కొన్నారు. మరోవైపు వైకాపాపై నిప్పులు చెరిగారు. అది ఒక జైలు రాజాల పార్టీ అని అభివర్ణించారు. ఈసారి వీరందరికీ ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు.
 
మేము అవినీతిపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నామని, ముందు ముందు కుడా చేస్తూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేసారు. మా పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ లో రెండు వికెట్లు పడ్డాయని అన్నారు. మిగిలిన అవినీతి మంత్రులను కుడా తొలగించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. జగన్ జైలుకు వెళ్లి ఏడాది పూర్తయిన రోజును ఆ పార్టీ బ్లాక్ డే గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. మరి ఆయన కారణంగా జైలుకు వెళ్ళిన ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలకు వారు ఏం సంధానం చెబుతారని ప్రశ్నించారు.