May 28, 2013

టీడీపీ వద్ద డబ్బులు లేవు... బలమైన కార్యకర్తలున్నారు

స్ధానికంలోనూ మనమే!
పార్టీ గుర్తులపై స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు


 
స్థానిక సంస్థలకు పార్టీ గుర్తుపై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జయకేతనం ఎగురవేయాలన్నారు. సైకిల్‌ జోరు పెరగాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. మన వద్ద డబ్బులు లేకపోయినా, బలమైన కార్యకర్తల బలగం ఉందన్నారు. జెండాలు మోసి, మోసి ఆలసిపోయారని, అయినా రానున్న ఎన్నికల్లో నేతలు, శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మన ముందు కూర్చున్నవారిలో ఎంతో మంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కానున్నారన్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికల విజయానికి నాంది కావాలన్నారు. మంగళవారం మహానాడు రెండవ రోజు ‘స్థానిక సంస్థలపై నిర్లక్ష్యమన్న’ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టగా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ బలపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10-15 ఏళ్లు హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించామన్నారు. 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేశామని గొప్పలు పోతున్న కాంగ్రెస్‌ నేతలు, రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలో స్థానిక సంస్థలు కునరిల్లుతున్నాయన్నారు. ఒక్కొక్క అధికారికి మూడు, నాలుగు మున్సిపాలిటీలు, మండలాలు అప్పగించడంతో వారు ఎక్కడ పర్యవేక్షించలేని దుస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోలేని దుస్థితిలో ప్రత్యేకాధికారులున్నారన్నారు. మంచినీటి కోసం బోర్లు బాగు చేయించమంటే చందాలు వేసుకుని బాగు చేయించుకోండంటూ అధికారులు సమాధానమనిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, స్థానిక సంస్థల పాలకవర్గాలు కూడా ముఖ్యమేనన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నిధుల విడుదలను ఆపివేసిందన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతామనే భయంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని విరుచుపడ్డారు.

టీడీపీ హయాంలో పద్ధతి ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, నిధులు, విధులు అప్పగించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకే ఇసుకరీచ్‌లను అప్పగించామని గుర్తు చేశారు. గ్రామపంచాయితీ, మండల, జిల్లాకు దామాషా ప్రకారం నిధులు కేటాయించడం జరిగేదన్నారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇసుకరీచ్‌లను కూడా తమ అనునయులకు కట్టబెట్టే దుష్ట సంప్రదాయానికి కాంగ్రెస్‌ తెరలేపిందన్నారు. టీడీపీ పాలనలో అన్ని గ్రామపంచాయితీల కార్యాలయాలకు సచివాలయమన్న పేరు పెట్టి సొంత భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు. రాష్ట్రానికి సచివాలయం ఎంత ముఖ్యమో, గ్రామ సచివాలయాలు అంతే ముఖ్యమని వ్యాఖ్యానిం చారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి పనులు స్థానిక సర్పంచ్‌ల నేతృత్వంలో చేపట్టడం జరిగిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.

స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ద్వారానే బీసీ నాయకత్వం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి టీడీపీ అంకితభావంతో ఉందని, అధికారంలోకి రాగానే నిధులు, అవసరమైన విధులు, బాధ్యతలు అప్పగించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బాబు డిమాండ్‌ చేశారు.ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తాచాటుకుందని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పరిస్థితి పునారావృతం చేయాలని బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా సింగిల్‌విండో ఎన్నికల్లో విజయం సాధించగలిగామన్నారు. టీడీపీ గెలిచే స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని అడ్డుకున్నారని, అలాగే డబ్బులు వెదజల్లి అనేక స్థానాల్లో గెలుపొందారన్నారు. అయినా టీడీపీ ఆశించినదానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. నాయకులు ఇంకా సమర్ధవంతంగా పనిచేసి ఉంటే మరిన్ని స్థానాలు గెలిచేవారమన్నారు.