May 28, 2013

'తెలుగుదేశం పార్టీ' నామకరణ - చారిత్రక వాస్తవాలు

'ఆలోచనలు పోయేవాడా
అనునిత్యం అన్వేషించేవాడా
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా
అశాంతుడా, పరాజయం ఎరుగనివాడా
ఊర్ధ్వదృష్టీ, మహామహుడా
మహాప్రయాణికుడా
మానవుడా మానవుడా'
- శ్రీశ్రీ- గోటేటి రామచంద్రరావు
నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు గారి ప్రత్యేక పౌర సంబంధాల అధికారి- గోటేటి రామచంద్రరావు

ఏవినీలాకాశ గర్భమునుండి, ఏ యుగారంభ సంరభమున భారతీయ ప్రేమామృతం ఆవనికి దిగివచ్చేనో... ఎవరు చెప్పగలరు? ఇయ్యది కాలమువలెనే అనంతము. ఆకాశమువలె సర్వవ్యాప్తము అని ఒక సందర్భంలో శ్రీ ముట్నూరి కృష్ణారావు వ్రాసిన వాక్యం శ్రీ రామారావు గారికి ఎంతగానో వర్తిస్తుంది.

విశ్వవిఖ్యాత తెలుగు తేజోరాశి, తెలుగువారికి, పరమపవిత్ర ప్రాత:స్మరణీయుడైన ధీరోదాత్తుడు ఆయన.
మానవ చరిత్రలో శాశ్వతస్థానం ఆర్జించుకున్న మహానుభావుడు, శ్రీ నందమూరి తారకరామారావు ఈ భూమిపై ఉద్భవించిన పవిత్రమైన రోజు ఇది.
మానవ అవగాహనకు నిర్వచనాలకు, వర్ణనకు, విశ్లేషణకు అందని రీతిలో చరిత్ర మహావేగంతో వీస్తూ ఎన్నోమలుపులూ, మెలుపులతో... అత్యంత వేగంగా సాగిపోతూ-- ఒక జాతి జీవన సంధ్యలో, సంఘర్షణలతో సతమతమవుతున్నప్పుడు మహానాయకులకి జన్మనిస్తుంది. ఆ మహానాయకుడే తిరిగి చరిత్రను సృష్టిస్తాడు. ఆ దిశలోనే మహత్తర చరిత్ర సృష్టించిన మహామనిషి శ్రీ ఎన్టీఆర్ జన్మించారు.

చలన చిత్ర రంగంలో హిమవన్నగ శిఖర సదృశుడుగా విరాజిల్లుతున్న ఆయనకి... సమకాలీనంగా.. మన దేశాన్నీ, మన రాష్ట్రాన్నీ అతలాకుతలం చేస్తూ, దినదినం కాదు.. క్షణ క్షణం దిగజారుతున్న రాష్ట్ర ఉనికికే కాక సామాన్య ప్రజాజీవనాన్నీ చిద్రుపలు చేస్తున్న చారిత్రక దురవస్థలో, అప్పటి ప్రజానాయకులు మనరాష్ట్ర వర్తమానాన్ని, భవిష్యత్తుని హస్తినలోని నిరంకుశుల పాదాల వద్ద పరచి ప్రజాస్వామ్య బానిసత్వానికి పునాదులు వేస్తున్న గర్హనీయ దురదృష్ట సమయం అది.

ఆ అప్రజాస్వామిక, ప్రజాద్రోహం, ఆత్మవంచన, అర్థరహిత పరావలంబన, ఆత్మగౌరవ నిర్వీర్యత చూసి, భరించలేక తన అంతరాలలో రగులుతున్న విప్లవాగ్నిని బహిరంగపరచి తెలుగుజాతి ఆత్మగౌరవ పున:స్థాపనకు, తెలుగు వ్యక్తిత్వ నిజస్వభావానికి నిద్రాణమై, నిర్వీర్యమైయున్న తెలుగు ప్రజల వైభవ, ప్రాభవాలు మేల్కొల్పడానికి, ప్రజలను ఉత్తేజితులను చేయడానికి, తెలుగుచరిత్ర, నాగరికత, సంస్కృతుల ప్రత్యేకతలు యావత్ ప్రపంచానికి తిరిగి చాటి చెప్పడానికి -- అనుకున్న మరుక్షణమే నడుంబిగించి.. దీక్షబూనిన కార్యదక్షుడాయన.

ఢిల్లీ పాదుషాల ఆభిజాత్యాన్ని, నిరంకుశత్వాన్ని పటాపంచలు చేయడానికి కార్యక్షేత్రంలోకి ఉద్యమించిన కర్తవ్యవీరుడు, క్రియాశీలి, అకళంక దేశభక్తుడైన శ్రీ రామారావు ఉవ్వెత్తున ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడుతూ తెలుగుదేశం అని తన పార్టీకి నామకరణం చేయడంతోనే తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆయన విప్లవ భావాలకు మన విస్తృత ప్రజాస్వామ్య ఫెడరల్ వ్యవస్థలోనే 'తెలుగుదేశం' అనే పార్టీకి పేరు పెట్టడం. ఒక వీరోచిత స్వాభావిక నిర్ణయం. ఏ ప్రాంతీయ సంకుచితత్వానికి తావులేని, దేశభక్తి పూరక నిర్ణయం అది.

1982 మార్చి 29కి సుమారు 10-15 రోజులకు ముందుగానే పార్టీ నామకరణ నిర్ణయం మీద శ్రీ ఎన్టీఆర్ తనకు తానుగా, వ్యక్తులకుగానీ, సన్నిహితులకుగానీ, పత్రికా ప్రపంచానికిగానీ చెప్పకుండా... తెలియనీయకుండా, నిర్ణయం తీసుకోవడంలో... తీవ్రంగా శ్రమించారు. ఆ పేరు నిర్ణయించడంలో నన్ను.. స్వర్గీయ నా సోదరుడు, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు స్వర్గీయ గోటేటి రాధాకృష్ణమూర్తినీ, ఆయనకి అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు, సహృదయుడు అయిన స్వర్గీయ శ్రీ డి.వి.ఎస్. రాజుగారినీ, ఆయన మిత్రుడు శ్రీ దువ్వదత్తుడు గారినీ, ఆయన్ని ఎంతో అభిమానించే స్వర్గీయ కొసరాజు రాఘవయ్య గారినీ, మహాకవి పండితుడు 'ఆంధ్ర పురాణకర్త' శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారినీ, ఆయనకి మిత్రుడైన శ్రీ దేవానాధన్ గార్లతో తీవ్ర చర్చలు పరమగోప్యంగా జరిపారు. ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (వీరే శ్రీ మధునా పంతుల వారిని 2 సార్లు దగ్గరుండి రాజమండ్రి నుంచి పంపించిన సన్నిత్రులు)కి మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు రామారావుగారి సోదరులు శ్రీ ఎన్. త్రివిక్రమరావు వచ్చేవారు.

ఆంధ్రుల చరిత్రని పురాణంగా రాసిన కవిపండితులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రామారావుగారికి ప్రాజ్ఞనన్నయ యుగం దగ్గరనుంచి తెలుగు కవిత్వ పరిణామ ప్రక్రియని వివరిస్తూ ఒక మహత్తర విషయాన్ని చెప్పారు.

అది.. ఎప్పుడో 7, 8 శతాబ్దాలలో శంకర భగవత్పాదులు పరమ పవిత్ర శ్రీ చక్ర రూపకల్పనలో 'తెలుగు సంఖ్యలను' ఉపయోగించారనీ, అంతకు మించి తెలుగుకి పవిత్రత ఎవరూ ఇవ్వలేరనీ, ఇవ్వలేదనీ చెప్పి శ్రీ ఎన్టీఆర్‌ని మంత్ర ముగ్ధులని చేశారు. తెలుగు, తెనుంగు, తెలంగాణ అన్నవన్నీ పర్యాయపదాలే అన్నారు. వారు చెప్పిన ఆ విషయం రామారావు గారి మదిలో గాఢంగా నాటుకుని తీవ్రంగా ఆలోచింపజేసింది. రామారావుగారు ఆయనకి పాదనమస్కారంచేసి గౌరవించారు.

అప్పుడే నాకు స్ఫురణకువచ్చి... గొప్పకవి, ఉపాధ్యాయుడు, ఆంధ్రసాహిత్య చరిత్ర రచయిత అయిన స్వర్గీయ పింగళి లక్ష్మీకాంతంగారి 'గౌతమవ్యాసముల'లోని 'ఆంధ్రవాఙ్మయ స్థూలరూపము' ప్రథమవ్యాస భాగాన్ని చదివి వినిపించాను అందులోని అంశాలు :-
'దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీనాథుడు మొదలైన పూర్వీకులచేతను... ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్య శబ్దవేత్తల చేతను ముక్త కంఠమున ప్రశంసింపబడిన తెలుగుకు మూడు పర్యాయపదములు కలవు. ఆంధ్రమనియు, తెలుగనియు, తెనుగనియు, కానీ, ఈ మూడు పదములలో 'తెనుగు-తెలుగు' అన్నవి రూపాంతరము లేననియు, ఆ పక్షమున మన భాషకు రెండే పర్యాయ పదములు ఉండెననియు నా ఊహ. ఈ రెండింటిలో ఆంధ్రమనునది మొదట రాజపరముగ, పిమ్మట దేశపరముగ, ఆపై దేశభాషా పరముగ ప్రయోగింపబడగా తెనుగనునది మొదట దేశ పరముగ పిమ్మట ప్రజాపరముగా, ఆపై వారి భాషా పరముగ మారింది'. ఈ విశ్లేషణను శ్రీ రామారావుగారు శ్రద్ధగా విన్నారు. మరొక సుప్రసిద్ధ తెలుగు సాహిత్య చరిత్రకారుడు వేరొక ప్రసిద్ధ పండితుడు శ్రీ నిడదవోలు వెంకట్రావుగారు మొట్టమొదట రాజ భాషగా ప్రకటించినది తంజావూరు నాయకరాజులే అని నిర్ధారించారు.

భారత రాజ్యాంగంపట్ల గౌరవంతో, పూర్తి గణతంత్ర స్ఫూర్తితో, భారత సార్వభౌమత్వానికి విశ్వాసంగా ఉండే రాష్ట్రీయమైన పేరుకోసం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మదిలో మెదిలే పేర్లు నాలుగు ఉండేవి. -తెలుగునాడు, -తెలుగునేల, -తెలుగు భూమి, -తెలుగు కేతనం మొదలైనవి. వీటిపై ఇదమిద్దంగా నిర్ధారణకి రాలేక లోలోనే ఆలోచనలు చేస్తున్న సమయం అది. మధునా పంతులవారి మాటల్లో ప్రమాణాలు, నేను వినిపించిన పింగళివారి వ్యాసంలో తెలుగు పదార్థ విశ్లేషణా సరళి, చారిత్రికత - కొసరాజుగారు గుర్తుచేసిన వేములపల్లి శ్రీకృష్ణగీతం 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా' మరికొన్ని భావస్ఫోరకమైన గీతాలతో సమావేశం నడిచేది. శ్రీ డి.వి.ఎస్ రాజు గారు చర్చలు సాగుతున్నంత సేపూ ఆతిథ్య బాధ్యతలు నిర్వహించేవారు. రామారావుగారు మాత్రం నిశ్శబ్దంగా అందర్నీ చూస్తుండేవారు. తీక్షణంగా... వింటూ.. సునిశితంగా... ఆలోచిస్తూవుండేవారు.

ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్టీపేరు నిర్ణయించడంలో వేగంగా ఒక స్థిరమైన నిర్ణయం రావడానికి, నా పరిధిలో, మరో ప్రయత్నంగా 20వ శతాబ్దంలో 'తెలుగుదేశాన్ని' జాగృతం చేసిన మహనీయుడు స్వర్గీయ మట్నూరి కృష్ణారావుగారి 'తల్లిపిలుపు' అనే వ్యాసాన్ని చదివి వినిపించాను. శ్రీ కృష్ణారావుగారు భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో 1937 ఫిబ్రవరి 6వ తేదీ సంచికలో వ్రాసిన భావగాంభీర్య, అర్థగాంభీర్య, ప్రబోధాత్మక వ్యాసం అది. 'ఆ వ్యాస సారాంశం':

'భారతమాత పసుపుపెట్టెరూపు దాల్చినది' తన బిడ్డలు తెచ్చియిచ్చు ఉపాహారములందు కొనుటకు విశ్వరూపిణియైన తల్లి పుత్రసౌలభ్యం కొరకు దాల్చిన మంగళరూపమే పసుపుపెట్టె - పసుపు పెట్టె పేరిట శోభనాకారముతో తల్లి సాక్షాత్కరించి, సేవననుగ్రహించుచున్నది. మన దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న మనలను ద్వేషించే తమిళులు మనకంటె మిన్నగా తల్లిదీవెనలందుకున్నారు. తల్లికెక్కుడు గూర్తుమని సంబరపడుతున్న తెలుగు బిడ్డలు ఈ అల్పసేవా సమయమున సాటి వారికి తీసిపొదురనుటకల్ల - దక్షిణాపథమంతయూ ఏకచ్ఛత్రము క్రింద తెచ్చిన ఆంధ్రప్రజ నేడు సాటివారు గర్భాలయములోకి చనుచుండ, తాము మాతృదేవాలయ ప్రాంగణమున నిలచియుందురనుట కాని మాట. ఇంతకింతలుమాని అన్యబేధములను మరచి, తెలుగులందరూ ఒక్కదారిన నడచి, నాయనుంగు బిడ్డలగుట సమర్థించుకొనుడని మాతృదేవత పిలుచుచున్నది రండు రండు.

ఆ పసుపు పెట్టెలలో మాతృమూర్తిని దర్శించి పూజాపుష్పములు సమర్పించివత్తుము రండు' ఇది విన్న మరుక్షణం శ్రీ ఎన్.టి.ఆర్. గభాలున కుర్చీలోంచి లేచి... 'ఇప్పుడు నా అభిప్రాయానికి ఆలోచనకి అవసరమైన సమాధానం దొరికింది 'ఆహా' ముట్నూరి వారికి జోహార్లు.. అని... మన పార్టీపేరు 'తెలుగుదేశం' తెలుగుతల్లి పిలుస్తోందిరా అని గట్టిగా ఉచ్చరిస్తూ, నేను ప్రజాముఖంగా ప్రకటించే వరకూ ఈ నిర్ణయం మన నలుగురి మధ్యనే ఉండాలి సుమా. ఎవరు ఎవరికి చెప్పకూడదు' అని ఆజ్ఞాపించారు తనదైన శైలిలో.

అలా శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి వ్యాసంతో ప్రేరణపొంది, ప్రభావంతులై తెలుగుదేశం పార్టీ అని నామకరణంతోబాటు తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అనే నినాదం, పసుపుపెట్టెలా పచ్చని పతాకలతో ఆ మహనీయుడు పార్టీని రూపొందించడం జరిగింది. ఆ కృతజ్ఞతా భావంతోనే ట్యాంక్ బండ్‌పై తెలుగు తేజోమూర్తుల వరసలో శ్రీ ముట్నూరి వారి విగ్రహం ఏర్పరచడానికి శ్రీ రామారావు నిర్ణయం తీసుకున్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా, సాటిలేని మేటి ప్రజానాయకునిగా, అత్యంత సమర్థుడైన రాజ్యాధినేతగా భాసిల్లి, ఎనలేని ధైర్యంతో ఆయన స్థాపించిన రాజకీయ పార్టీకి తెలుగుదేశం అని పేరుపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన అనేకానేక ప్రజాసంక్షేమ, విద్యావైజ్ఞానిక, సంస్కృతి, కళాత్మక కార్యక్రమాల నామ నిర్ధారణ 'తెలుగు' అనే పదంతోనే ప్రారంభించిన వైనం ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేనిది, శాశ్వతమైనది.
నాటికీ, నేటికీ, ఎప్పటికీ యావత్ తెలుగుజాతి జాజ్వల్యమానమైన గౌరవానికీ, ఐక్యతకు, ఏకత్వానికీ, ఆత్మగౌరవానికీ, నాగరికతకు, తెలుగుభాషా సాహిత్యాలకు, తెలుగు సంస్కృతికి... ఆయనే శాశ్వత చిహ్నంగా చరిత్ర పుటల్లో నిలచి ఉంటారు.

ఎవరికీ తెలియని ఈ చారిత్రక రహస్యాలన్నీ నేనే వ్రాయాలని గౌరవనీయులు ప్రముఖ నిర్మాత, నందమూరి సోదరులకు ఆత్మీయ మిత్రుడు, శ్రీ డి.వి.ఎస్. రాజుగారు అనేక పర్యాయాలు నాతో అనేవారు. తీవ్ర అనారోగ్యంతో కేర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను, మిత్రుడు నాటకప్రయోక్త దీక్షిత్‌తో సహా వెళ్లినప్పుడు అప్పటి ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న శ్రీ సూర్యనారాయణరావుగారు, రచయిత యడవల్లిగారు, డి.వి.ఎస్. రాజు గారి కుమారుడు ఉండగా నాతో తెలుగుదేశం పార్టీ చరిత్ర గురించి, రామారావుగారి గురించి సమర్ధవంతంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా, వ్రాయగల సమర్థులు మీరే. మీరే వ్రాయాలి లేకపోతే వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అని నన్ను ఆదేశించారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నామావిర్భావ సమయంలో మాతో ఉన్న డి.వి.ఎస్. రాజుగారిని స్మరించడం నా విధ్యుక్త ధర్మం, కర్తవ్యం. మా అందరికీ అంకితభావం, సామాజిక స్పృహ, దీక్ష, దక్షతలు కలిగించడానికి నిత్యస్ఫూర్తిదాయకుడైన మహానాయకుడు శ్రీ నందమూరి తారకరామారావు. ఆయనకెంతో ప్రీతిపాత్రమై, తన గంభీరగళంతో, శ్రావ్యమైన ప్రసిద్ధ పద్యాన్ని చదవగల్గిన ఆ మహా అధినేతను స్మరిస్తూ:

'తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
ఏను తెలుగు వల్లభుండ తెలుగోకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స'

..........